పెట్టుబడులకు ఎన్నారైల సేవలు | NRI investment to Services | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ఎన్నారైల సేవలు

Published Thu, Jun 9 2016 3:23 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

పెట్టుబడులకు ఎన్నారైల సేవలు - Sakshi

పెట్టుబడులకు ఎన్నారైల సేవలు

- సిలికాన్ వ్యాలీలో ఎన్నారైలతో కేటీఆర్ సమావేశం
- వ్యాలీలో టి-హబ్ ఔట్‌పోస్టు ఏర్పాటుకు యోచన

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాలోని వివిధ రంగాల్లో విజయవంతమైన తెలంగాణ ఎన్నారైల సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ గడ్డ నుంచి చాలా మంది కొన్ని దశాబ్దాల కిందటే అమెరికాలో ఉద్యోగాలు ప్రారంభించి, వివిధ కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. మరికొంత మంది సొంత కంపెనీలు నెలకొల్పారని, ఇంకొందరు వెంచర్ క్యాపిటలిస్టుగా రాణిస్తున్నారన్నారు. ఇలా వివిధ రంగాల్లో విజయవంతమైన ఎన్నారైలతో మంత్రి సిలికాన్ వ్యాలీలో సమావేశమయ్యారు. మెదక్ జిల్లా నుంచి అమెరికాలో స్థిరపడిన ఓం నల్లమాసు కీలక పాత్ర పోషిస్తున్న అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీలో ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాజురెడ్డి, రాంరెడ్డి, కిట్టు కొల్లూరి వంటి వెంచర్ క్యాపిటలిస్టులు, వివిధ కంపెనీల్లో టాప్ మేనేజ్‌మెంట్‌లలో పనిచేస్తున్న 40 మంది తెలంగాణ ఎన్నారైలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యంగా పారిశ్రామిక విధానం, టీ-హబ్, ఐటీ పాలసీ వంటి అంశాలను వివరించిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం వారి నుంచి కోరుకుంటున్న సహాయ సహకారాలను తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతున్న టీ-హబ్ అవుట్ పోస్టు ఆలోచనను వారితో పంచుకున్నారు. ఈ ఆలోచనను అభినందించిన ఎన్నారైలు.. అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అవుట్ పోస్టు ఏర్పాటు, అందులో స్టార్టప్‌ల ఎంపిక, వాటికి సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటలిస్టులతో ఆర్థిక సహకారం వంటి అంశాల్లో పూర్తి సహకారం ఇస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అత్యుత్తమైందని, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను అమెరికాలోని కంపెనీలకు తెలపాలని మంత్రి కోరారు. రాజకీయ స్థిరత్వం, సమర్థవంతమైన పాలన, పారదర్శక విధానాలున్న కొత్త రాష్ట్రాన్ని కంపెనీలకు పరిచయం చేయాలన్నారు. ఎన్నారైల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపకల్పన చేస్తోందని, తన పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే సీఎంతో చర్చించి పూర్తి వివరాలతో ప్రకటన చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement