జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నీటి ఎద్దడి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో అన్ని వాణిజ్య సముదాయాలు, నివాస గృహాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు చేసేలా, అవి ఏర్పాటైన తరువాతనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలను ఆదేశించింది. ఇంకుడు గుంతల ఏర్పాటు విషయంలో ఇప్పటికే జారీ చేసిన జీవోను అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది.
అలాగే ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నగరంలో భవన నిర్మాణ నిబంధనలు, జీవో 350ల ప్రకారం ఇంకుడు గుంతల ఏర్పాటునకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.వైదేహిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.