పసలేని సిట్‌ విచారణ..! | Officials do not get the confidential information from Kelvin | Sakshi
Sakshi News home page

పసలేని సిట్‌ విచారణ..!

Published Tue, Jul 18 2017 3:56 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

పసలేని సిట్‌ విచారణ..! - Sakshi

పసలేని సిట్‌ విచారణ..!

కెల్విన్‌ నుంచి రహస్య సమాచారం రాబట్టని అధికారులు
-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రూపొందించిన ప్రశ్నావళికే పరిమితం?
అనుభవలేమితో విచారణలో తడబాటు..
రెండు రోజుల్లో 12 గంటలపాటు విచారణ..
-పూర్తిస్థాయి సమాచారం సేకరించకుండానే కోర్టుకు అప్పగింత
19 నుంచి విచారణకు చలన చిత్ర ప్రముఖులు
కెల్విన్‌ చెప్పిన ‘కొకైన్‌ బ్యాచ్‌’ సంగతేంటి?
 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ నుంచి సిట్‌ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయిందా? మత్తు దందాలో ఆరితేరిన కెల్విన్‌ మస్తిష్కంలోని చిట్టాలను సిట్‌ విప్పలేకపోయిందా? ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్‌ రాసిచ్చిన ప్రశ్నావళిని మించి ముందుకు పోలేకపోయిందా? సిట్‌ సభ్యు ల అనుభవ రాహిత్యం కెల్విన్‌కు కలసి వచ్చిం దా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్‌ కేసు వ్యవహారంలో వ్యాపారి కెల్విన్‌ను 12 గంటల పాటు ప్రశ్నించిన సిట్‌ పూర్తి స్థాయి సమాచారం సేకరించకుండానే తిరిగి కోర్టుకు అప్పగించినట్టు తెలుస్తోంది.

సిట్‌ సభ్యులకు గతంలో పెద్ద స్థాయి ఎక్సైజ్‌ నేరాలపైగాని, డ్రగ్స్‌ కేసులపైగాని, ప్రొఫెషనల్‌ నేరగాళ్లగానీ డీల్‌ చేసిన అనుభవం లేకపోవటంతో విచారణలో తడబడ్డట్లు తెలుస్తోంది. కెల్విన్‌ తరఫున వచ్చిన న్యాయవాది సమక్షంలో విచారించడానికి సిట్‌ కొంత ఇబ్బంది పడ్డట్లు సమాచారం. కెల్విన్‌ మొబైల్‌ కాల్‌ డేటా విశ్లేషణ చేసిన సిట్‌కు సినిమా పరిశ్రమకు చెందిన దర్శకులు, నటులు, టెక్నిషన్లకు చెందిన సెల్‌ నెంబర్లు లభించాయి. వీటి ఆధారంగా కొంత రహస్య సమాచారాన్ని సేకరించిన అధికారులు వాటిని నివృత్తి చేసుకోవటంతోపాటు, డ్రగ్‌ వినియో గం, సరఫరాలో ఇంకొంత సమాచారం సేకరించడం కోసం కెల్విన్, ఖుద్దూస్, వాహిద్‌లను రెండు రోజుల కస్టడీ కోరిన విషయం తెలిసిందే.
 
అధికారుల అనుభవలేమి..
సిట్‌లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒక అధి కారికి చట్టాలు, పుస్తకాలపై మంచి పట్టు ఉంది. కానీ ఆయనకు క్షేత్రస్థాయి అనుభవం తక్కువ. మరో సభ్యుడికి ఎక్సైజ్‌ నేరాల పరిశోధనల్లో అవగాహన లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌లో పని చేస్తున్నప్పటికీ గుడుంబా, ఎన్డీపీఎల్‌ తరహా కేసులు మినహా పెద్ద కేసులు డీల్‌ చేసిన అనుభవం లేన ట్లు వారి ట్రాక్‌ రికార్డును బట్టి తెలు స్తోంది. ఇక సిట్‌కు ముగ్గురు ఏఈఎస్‌ స్థాయి అధికారులు సహకరిస్తున్నారు. వారు నేరుగా పోస్టింగ్‌లోకి వచ్చిన అధికారులు. వారు లీడ్‌ తీసుకొని డీల్‌ చేసేంత స్థాయి లేదని ఎక్సైజ్‌ వర్గాలే చెబుతున్నాయి. ఈ నెల 19 నుంచి 28 వరకు చలన చిత్ర ప్రముఖులు విచారణకు హాజరుకానున్నారు.
 
నాకు తెలీదు.. ఏమో గుర్తులేదు..
ఇద్దరు సభ్యుల సిట్‌.. బాలానగర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో కెల్విన్‌ను విచారించింది. రెండు రోజుల్లో 12 గంటలపాటు అతడిని ప్రశ్నించింది. అతడికి డ్రగ్స్‌ ఎప్పటి నుంచి అలవాటు? వ్యాపారిగా ఎప్పటి నుంచి మారాడు? చిత్ర పరిశ్రమతో ఉన్న సంబంధాలు, పరిచయాలు.. తదితరాలపై తొలిరోజు కొంత సమాచారం రాబట్టగలిగింది. అది కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ రూపొందించిన ప్రశ్నావళినే గుచ్చి గుచ్చి అడగటంతో.. సిట్‌ అధికారుల విచారణ సామర్థ్యాన్ని పసిగట్టిన కెల్విన్‌ నోరు తెరవటానికే మొండికేసినట్లు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు ‘నాకు తెలీదు’, ‘ఏమో గుర్తు లేదు’, ‘వాళ్లు ఎవరో’ అంటూ సమాధానాలు ఇచ్చి నట్టు తెలిసింది. ఒక దశలో కెల్వినే అధికారులకు ఎదురు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
 
కొకైన్‌ బ్యాచ్‌లో అందరూ పెద్దోళ్లే..
‘మీరు (సిట్‌ అధికారులను ఉద్దేశించి) ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ తీసుకుంటున్న వాళ్లకే నోటీసులు ఇచ్చారు. కొకైన్‌ బ్యాచ్‌ను వదిలేస్తున్నారు’ అని కెల్విన్‌ అన్నట్లు విశ్వసనీయంగా తెలిసిం ది. కొకైన్‌ బ్యాచులో అందరూ పెద్దోళ్లే ఉన్నారని, వారిని ప్రశ్నిస్తే రాజకీయం, సినిమా రంగంలో ప్రముఖులు దొరుకుతారని చెప్పినట్లు సమాచారం. విచారణ తీరు దారి మళ్లిం చటానికి కెల్విన్‌ తనకు పిచ్చెక్కుతోందని, ఒక్క డోస్‌ అయినా డ్రగ్‌ కావాలని పట్టుబట్టి జుట్టు పీక్కునట్లు తెలిసింది. దీంతో అధికారులు ఆత్మరక్షణలో పడ్డట్లు సమాచారం.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement