అక్కినేని జీవితం.. ఓ స్ఫూర్తి సంతకం
17న అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం
సిటీబ్యూరో: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ నెల 17న సాయంత్రం మూడున్నర గంటల నుంచి కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాలలో అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్, రవి కొండబోలు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అక్కినేని జీవితం యువతకు స్ఫూర్తి కావాలనే లక్ష్యంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు వివరించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి అవార్డులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సౌజన్యంతో తీర్చిదిద్దిన డాక్టర్ అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
అక్కినేని ఫౌండేషన్ వెబ్‌సైట్ ఆవిష్కరణ, అక్కినేనిపై రూపొందించిన ప్రత్యేక సంచిక, డాక్టర్ కృష్ణకుమారి రచించిన ‘మనిషిలో మనిషి’ గ్రంథావిష్కరణ కూడా ఇదే వేదికపై జరగనున్నదని తెలిపారు. ‘అక్కినేని వ్యక్తిత్వం, జీవితం యువతరానికి ఒక స్ఫూర్తి సంతకం కావాలి’ అనే అంశంపై స్వాతి వారపత్రిక సౌజన్యంతో నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు లక్ష రూపాల బహుమతి ప్రదానం చేస్తారన్నారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా కార్యదర్శి శారద ఆకునూరి, బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ మురళి వెన్నం తదితరులు పాల్గొన్నారు.
అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు వీరే..
పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి( శాస్త్ర సాంకేతిక రంగం), జస్టిస్ ఎస్.పర్వతరావు( చట్టం, న్యాయం), ఐఎఎస్ అధికారి పి. సంపత్ కుమార్( పౌర సేవలు), యంఎన్ రాజు (విద్యారంగం), దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(సినిమా), డాక్టర్ వంశీ రామరాజు (సామాజిక సేవ), గుమ్మడి గోపాలకృష్ణ (రంగస్థలం), డాక్టర్ గోపీచంద్ మన్నం (వైద్యరంగం), జ్యోతి సురేఖ వెన్నం (యువత - క్రీడారంగం)లు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు.