
వన్ కూటమితోనే పారదర్శక పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మియాపూర్: నైతిక విలువలు, ఆదర్శ భావాలున్న వన్ కూటమితోనే పారదర్శక పాలన సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మియాపూర్ జేపీనగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ధన, అధికార బలంతో విర్రవీగుతున్న టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పే సత్తా వన్ కూటమికే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటపు పథకాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్న టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడి, వన్ కూటమిని గెలి పించాలని కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేసినా కోట్ల మీదే తప్ప నేలమీద నిలిచేలా ఉండవని విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు అన్ని ఎమ్మెల్సీ సీట్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసునన్నారు. విశ్వనగరం మాట దేవుడెరుగు.. పేదవాడి ప్రాథమిక అవసరాలు తీర్చితే అదే పదివేలన్నారు. లోక్‌సత్తా తెలంగాణ కార్యదర్శి ఎం.పాండు రంగారావు మాట్లాడుతూ చండీయాగాలు, చైనా యాత్రలతో ప్రజల సమస్యలు తీరవని, హైదరాబాద్ అకస్మాత్తుగా విశ్వనగరంగా మారిపోదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎం నేలవిడిచి సాము చేయకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వన్ కూటమి ఓట్లను అడుగుతుందే తప్ప.. అధికార పార్టీలా మార్కెట్‌లో సరుకులా కొనుక్కోదన్నారు. వనం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు, కూటమి మియాపూర్ డివిజన్ అభ్యర్థి తాండ్ర కుమార్, ఎండీ గౌస్, శోభన్ పాల్గొన్నారు.