
స్కార్పియో బీభత్సం..
- వేగంతో వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన కారు
- ఒకరు మృతి.. మరో నలుగురికి గాయాలు
- మాదాపూర్‌లో ఘటన
హైదరాబాద్: జనసమ్మర్థ ప్రాంతం... మితిమీరిన వేగం... రోడ్డుపై అడ్డదిడ్డంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ... ఒకరిని బలితీసుకుంది. మరో నలుగురిని గాయాలపాలు చేసింది. శనివారం రాత్రి మాదాపూర్ కావూరిహిల్స్ ఉడెక్స్ కాంప్లెక్స్ వద్ద ఈ బీభత్సం చోటుచేసు కుంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న బసంత్ శనివారం రాత్రి స్కార్పియో వాహనంలో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వేగంగా దూసుకెళుతున్నాడు.
ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారిపై గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వెళు తున్న బసంత్... కారును అదుపు చేయలేక పోయాడు. ఈ క్రమంలో కావూరిహిల్స్ వద్ద ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు కార్లను ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న రామకృష్ణ(55) అక్కడికక్కడే మరణించారు. బైకులపై వెళుతున్న మరో నలుగురు లాలూసాబ్, కె.శంకర్, భాషా, శ్రీశైలం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టూ వీలర్లు నుజ్జునుజ్జయ్యాయి. రంగం లోకి దిగిన పోలీసులు స్కార్పియో డ్రైవర్ బసంత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.