సీబీఐ అదుపులో ఇద్దరు గుజరాతీయులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు చెందిన లిక్విడేటర్ సొమ్మును కొల్లగొట్టిన వారికి ఉచ్చు బిగుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. బ్యాంకుల నుంచి డబ్బును కొల్లగొట్టడంలో కీలక ప్రమేయముండటంతో గుజరాత్‌కు చెందిన గన్‌శ్యాం సి.జోషి, హార్దిక్ ప్రవీణ్ భాయ్ జోషిలను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. న్యాయస్థానం అనుమతితో వీరిద్దరిని 14 రోజుల కస్టడీకి సీబీఐ తీసుకుంది. హైకోర్టు లిక్విడేటర్‌కు చెందిన రూ.30 కోట్లను బ్యాంకుల నుంచి మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.
ఈ కేసులో కీలక నిందితుడైన దామోదర్‌మణి పక్కా ప్రణాళికతోనే బ్యాంకుల నుంచి డబ్బులు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఖమ్మంలోని యునెటైడ్ బ్యాంకు మేనేజర్ కె.శ్రీకాంత్ కూడా నిందితులతో కుమ్మక్కైనట్లు తేలింది. తెలంగాణ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో మెరుగు శ్రీనివాసరావు ఒక అకౌంట్ ప్రారంభించి, దానిద్వారా నిధులు దోచుకున్నారు. శ్రీనివాస్ ప్రారంభించిన ఖాతా నుంచి వివిధ బ్యాంకులకు విడుతల వారీగా రూ.8.89 కోట్లు మళ్లించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి మిగిలిన నిందితులందరినీ అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు.
కొనసాగుతున్న ‘లిక్విడేటర్’ అరెస్టులు
Published Sat, Mar 19 2016 4:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement
Advertisement