
ఆన్‌లైన్‌లో మోసాలు.. ముఠా గుట్టురట్టు!
హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబర్ క్రైం పోలీసులు. నగరంలో సైబర్ క్రైం ఆపరేషన్‌లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉన్న ప్లానెట్ ఐ ట్రేడ్ సెంటర్‌పై బుధవారం సైబర్ క్రైం పోలీసులు దాడులు జరిపారు. సైబర్‌క్రైం ఏసీపీ రఘువీర్, సీఐ శంకర్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్లానెట్ ఐ ట్రేడ్ సెంటర్ కంపెనీ మేనేజర్ పాటూరి వీరభద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 50 మంది ఉద్యోగులతో వీరభద్రరావు కాల్ సెంటర్‌ను నడుపుతున్నాడనీ, లక్కీ డిప్‌ల ద్వారా 3 తులాల బంగారం ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
ఓన్లీ పోస్టల్ ఛార్జీలు మాత్రమే కట్టాలంటూ మోసానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న గిప్ట్‌లో పుసల దండను ఇచ్చి ఈ కంపెనీకి చెందిన ముఠా మోసానికి పాల్పడినట్టు తెలిపారు. రోజుకు వేయ్యి నుంచి రెండువేల మందిని ఈ ముఠా మోసగిస్తోంది. తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి పార్సిళ్లు పంపేందుకు కంపెనీ యజమాని పోస్టల్ కోడ్ తీసుకున్నట్టు సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.