అప్‌డేట్ పేరుతో ఎర
హైదరాబాద్:
మీ ఎన్‌ఆర్‌ఐ బ్యాంక్ ఖాతా వివరాలు ఆప్‌డేట్ చేయాలంటూ నగరానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐకి ఫిషింగ్ లింక్ పంపి అతడిచ్చిన వివరాలతో రూ.8 లక్షలు కాజేశారు. ముంబై కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్, మరో ఇద్దరు ముంబై వాసులను సైబరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖతర్‌లో పనిచేస్తున్న కూకట్‌పల్లికి చెందిన ప్రవీణ్ కుమార్‌కు సికింద్రాబాద్ కార్ఖాణాలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్‌ఆర్‌ఈ అకౌంట్, ఎన్‌ఆర్‌వో అకౌంట్లు ఉన్నాయి.
గత ఏడాది ఆగస్టు 31న మీ ఎన్‌ఆర్‌ఈ అకౌంట్‌ను అప్‌డేట్ చేయాలంటూ ఫిషింగ్ మెయిల్ వచ్చింది. ఇది అచ్చం అసలు బ్యాంక్ లింక్ మాదిరిగానే ఉండటంతో ప్రవీణ్‌కుమార్ అందులో యూజర్ నేమ్, పాస్‌వర్డ్ టైప్ చేసి తన వివరాలను పంపాడు. అప్పటినుంచి ఎన్‌ఆర్‌ఈ అకౌంట్ నుంచి ఎన్‌ఆర్‌వో అకౌంట్‌కు, అక్కడి నుంచి ముంబై, వెస్ట్ బెంగాల్‌లోని వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీలు జరిగాయి. రూ. 8 లక్షలు బదిలీ జరిగినట్లు నాలుగు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి.
దీనిపైఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించగా మోసపూరిత లావాదేవీలు జరిగాయని నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుల ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐపీ అడ్రస్, వివిధ బ్యాంక్ ఖాతాల నంబర్ల ఆధారంగా నిందితులు ముంబైలోని వాషిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికెళ్లిన పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో చినోస్ ఓజర్, ముంబైలోని బాంద్రా ఈస్ట్‌కు చెందిన అశోక్ రవి ఆరోరా, ఇమితియా సాదిక్ సయ్యద్‌లను అరెస్టు చేశారు. ముంబై, వెస్ట్‌బెంగాల్‌లోని నిందితుల బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు.
వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నేరానికి ప్రధాన సూత్రధారి నైజీరియాకు చెందిన ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఫిషింగ్ లింక్‌ను పంపగా ప్రవీణ్ కుమార్ నింపిన వివరాలతో ఆ డబ్బును వివిధ ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు మరో నైజీరియన్ చినోస్ ఓజర్, రవి ఆరోరా, సాదిక్ సయ్యద్‌లు సహకరించారని పోలీసు విచారణలో తేలింది. కాగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.