NRI account
-
ఎన్ఆర్ఐ అకౌంట్లోని రూ.6.5 కోట్లు మాయం
పంజగుట్ట: ఓ ఎన్ఆర్ఐ ఖాతా నుండి రూ.6.5 కోట్ల నగదును బ్యాంకు సిబ్బంది మాయం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ్రస్టేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయకు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుండి ప్రీమియం అకౌంట్ ఉంది. బేగంపేట యాక్సిస్ బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ పాసర్ల, వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సురేఖ సైనాలు కలిసి పరితోష్ ఉపాధ్యాయ పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారు. ఈ చెక్కుల ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి పలుమార్లు మొత్తం రూ.6.5 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. చెక్కులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారునికి మెసేజ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతటితో ఆగకుండా పరితోష్ ఉపాధ్యాయ బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీయగా తన బ్యాంకు అకౌంట్ నుండి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం -
ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్: యోనో యాప్‌తో ఈజీగా
NRIs SBI YONO app: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. యోనో యాప్‌ద్వారా నాన్-రెసిడెంట్ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ)లు సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ సులభంగా తెరవడానికి డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు కొత్త ఖాతాదారులకు ఉద్దేశించిందని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం భారతదేశంలో ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి సులభమైన విధానాన్ని కోరుకునే ఎన్ఆర్ఐ క్లయింట్ల నుంచి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరిస్తుంది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) తాజా అప్డేట్ ప్రకారం ఎన్ఆర్ఐలు భారతదేశంలోని సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్లలో కూర్చొని తమ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను తెరవచ్చు. దీంతో అకౌంట్ ను ఓపెనింగ్ ప్రక్రియ ఎన్ఆర్ఐ కస్టమర్లకు వేగం మరింత సులభతరమవుతుంది. అలాగే డిజిటల్ సేవల ద్వారా లావాదేవీలు మరింత ఈజీ కానున్నాయని డిఎండి & హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్ & ట్రాన్స్ఫర్మేషన్) నితిన్ చుగ్ తెలిపారు.అంతేకాదు మూడే మూడు స్టెప్స్‌లో ఖాతాను తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు కూడా. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) ముచ్చటగా మూడు స్టెప్స్ ►యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ►హోమ్‌పేజీలో ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాతెరిచే ఆప్షన్ ఎంచుకోవాలి ► ఇది పూర్తి అయిన తరువాత కేవైసీ వివరాలను సబ్మిట్ చేయాలి. ఇండియాలోతాము ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్న ఎస్బీఐ బ్రాంచ్‌కు కేవైసీ డాక్యుమెంట్స్‌ను అందించవచ్చు. లేదా కేవైసీ డాక్యుమెంట్స్‌ను నోటరీ, హై కమీషన్, ఎస్బీఐ ఫారిన్ ఆఫీస్, ఇండియన్ ఎంబసీ, రిప్రజెంటేటివ్ ఆఫీస్, కోర్ట్ మేజిస్ట్రేట్ లేదా జడ్జితో అటెస్ట్ చేసి తదుపరి ప్రాసెసింగ్ కోసం సంబంధిత బ్రాంచ్‌కి మెయిల్ చేయాలి. అలాగే కస్టమర్లు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. -
ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఎన్ఆర్ఐ సొసైటీ, వైద్య కళాశాలలో నిధుల మళ్లింపుపై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోదాలపై కీలక ప్రకటన చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం 53 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది. ‘ నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేశాం. ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. ఆ ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించాము. ఎంబీబీఎస్ విద్యార్థుల దగ్గర పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించారు. ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుండి ఎన్‌ఆర్‌ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించాము.’ అని తెలిపింది ఈడీ. ఎన్ఆర్ఐ సొసైటీలో జరిగిన అవకతవకలపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతంలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది. ఇదీ చదవండి: బీసీలను బెదిరించాడు.. చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు: సీఎం జగన్ -
ఆ కస్టమర్లకు షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది. ఏవేవి పెరిగాయి.. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్ జారీ, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, IMPS అవుట్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి. బ్యాంక్ జరిమానా ఛార్జీలు చెక్ రిటర్న్ అవుట్‌వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్) వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది. చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
Whatsapp Hacking: ఎన్ఆర్ఐల వాట్సాప్నూ వాడేసుకుంటున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఒక్కో తరుణంలో ఒక్కో తరహా నేరాలు చేసే ఈ క్రిమినల్స్ తాజాగా వాట్సాప్‌ను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల (ఎన్ఆర్ఐ) ఖాతాలను హ్యాక్ చేస్తూ ఇక్కడ ఉన్న వారి సంబంధీకుల నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ తరహా నేరాలకు సంబంధించి బుధ, గురువారాల్లో రెండు కేసులు నమోదైనట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఈ వాట్సాప్ హ్యాకింగ్ అనేది కొన్నాళ్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడి వారి ఫోన్లనే హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా పంథా మార్చారు. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలకు చెందినవి హ్యాక్ చేయడం మొదలెట్టారు. సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ... మరో ఫోన్లోకి మారితే... ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా తమ ఫోన్లో వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అందులో తాము టార్గెట్ చేసిన యూఎస్‌లోని ఎన్ఆర్ఐ నెంబర్లు ఎంటర్ చేస్తున్నారు. దీని వెరిఫికేషన్ కోడ్ అసలు యజమాని వద్దకు వెళ్తుంది. వివిధ పేర్లతో సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశామని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి వెరిఫికేషన్ కోడ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులతో పాటు ఇతర కాల్ సెంటర్ల పేర్లు వాడుతున్నారు. ఇలా ఓటీపీని చేజిక్కించుకుని తమ ఫోన్లలో ఎన్ఆర్ఐల నెంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటున్నారు. దీని వల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. ఇలా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ నెంబర్లు సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన శ్రీరామ్‌కు బుధవారం ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. అమెరికాలో ఉంటున్న తన సమీప బంధువు సుజాత నెంబర్ నుంచి పంపినట్లు ఉంది. మెడికల్ ఎమర్జెన్సీ అని, డబ్బు కావాలంటూ అందులో ఉండటంతో శ్రీరామ్ రెండు బ్యాంకు ఖాతాల్లోకి రూ.10.98 లక్షలు బదిలీ చేశారు. కూకట్‌పల్లికి చెందిన నరేంద్రకు ఈ నెల 10న అమెరికాలో ఉంటున్న తన బాల్య స్నేహితుడు రవి శ్రీనివాస్ పేరుతో సందేశం వచ్చింది. ఈయన కూడా ఆ సందేశాల్లో సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి రూ.10.98 లక్షలు బదిలీ చేశారు. ఆపై ఈ బాధితులు ఇద్దరూ అమెరికాలో ఉంటున్న వారి సంప్రదించి జరిగిన మోసం తెలుసుకున్నారు. దీంతో బుధవారం శ్రీరామ్, గురువారం నరేంద్ర సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరు పంపిన డబ్బు ఢిల్లీ, రాజస్థాన్‌లకు చెందిన బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఖాతాల సారూప్యత నేపథ్యంలో ఒకే వ్యక్తి లేదా గ్యాంగ్ రెండు నేరాలకు పాల్పడినట్లుఅంచనా వేస్తున్నారు. ముందు ఇక్కడివే హ్యాక్ చేస్తారు ఈ సైబర్ నేరగాళ్లు తొలుత ఇక్కడ ఉన్న వారి వాట్సాప్ నెంబర్లే హ్యాక్ చేస్తారు. అలా వారి యాప్‌లో ఉన్న వివిధ గ్రూపుల్లోని కాంటాక్ట్స్, చాటింగ్స్ తదితరాలు పరిశీలిస్తారు. అందులో ఉన్న విదేశీ నెంబర్లను ఎంపిక చేసుకుని, అనువైన వాటిని హ్యాక్ చేసి అసలు కథ నడిపిస్తారు. ఈ తరహా నేరాలు ఇంకా జరిగే ప్రమాదం ఉంది. కేవలం సందేశాల ఆధారంగా ఆర్ధిక లావాదేవీలు చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా డబ్బు పంపేప్పుడు వారితో ఓసారి మాట్లాడి నిర్థారించుకోవాలి. ఆ తర్వాత కూడా డబ్బు పంపే ముందు అన్నీ సరిచూసుకోవాలి. – కె.బాలకృష్ణ రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ, సైబరాబాద్. చదవండి: సైకో భర్త ఘాతుకం.. ఇద్దరు భార్యలను.. -
ఎన్ఆర్ఐలు.. బ్యాంకు అకౌంట్లు
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత దేశంలో పలు రకాల బ్యాంకు ఖాతాలు కలిగి ఉండవచ్చు. ఎన్ఆర్ఇ (నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్) సేవింగ్స్ అకౌంట్ : ఎన్ఆర్ఇ అకౌంట్‌ను భారత కరెన్సీలో నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలోకి విదేశాల నుండి విదేశీ మారక ద్రవ్యం ద్వారా మాత్రమే డబ్బు జమచేయవచ్చు. తన సంపాదనను ఇందులోకి బదిలీ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ ఖాతాలోని డబ్బును తాను నివసిస్తున్న దేశానికి వాపస్ (రిపాట్రియేట్) తీసికెళ్ళవచ్చు. ఇద్దరు ఎన్ఆర్ఐలు కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) సేవింగ్స్ అకౌంట్ : ఎన్ఆర్ఓ అకౌంట్‌ను భారత దేశంలోని లావాదేవీల కొరకు ఉపయోగించవచ్చు. భారత్ లో వచ్చిన ఆదాయాన్ని ఇందులో జమ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే ఆదాయం పై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖాతాలోని డబ్బు ద్వారా వచ్చిన వడ్డీని తాను నివసిస్తున్న దేశానికి వాపస్ (రిపాట్రియేట్) తీసికెళ్ళవచ్చు. అసలు ను కొన్ని నిబంధనలకు లోబడి వాపస్ తీసికెళ్ళవచ్చు. ఇద్దరు ఎన్ఆర్ఐలు లేదా ఒక ఎన్ఆర్ఐ తోపాటు భారత్ లో ఉన్న మరొకరితో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఎఫ్ సి ఎన్ ఆర్ డిపాజిట్ అకౌంట్: పారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ ఖాతాలను అమెరికన్ డాలర్, బ్రిటన్ పౌండ్, యూరో, స్విస్ ప్రాంక్, సింగపూర్ డాలర్, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, హాంగ్ కాంగ్ డాలర్, జపాన్ యెన్ లాంటి 9 విదేశీ కరెన్సీలలో నిర్వహించుకోవచ్చు. ఆర్ ఎఫ్ సి (రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ) అకౌంట్: ఎన్ఆర్ఐలు భారత దేశానికి వాపస్ వచ్చిన సందర్భంలో వారి ''ఎన్ఆర్ఐ హోదా'' కోల్పోతారు. ఈ సందర్భంలో వారు ఈ ఖాతా ను తెరవవచ్చు. అమెరికన్ డాలర్, బ్రిటిష్ పౌండ్ లలో ఈ ఖాతాను నిర్వహించుకోవచ్చు. మళ్ళీ ఎన్ఆర్ఐ హోదా పొందిన తర్వాత ఈ ఖాతాలో డబ్బును ఎంఆర్ఇ లేదా ఎఫ్ సి ఎన్ ఆర్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. -మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com -
అప్డేట్ పేరుతో ఎర
హైదరాబాద్: మీ ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతా వివరాలు ఆప్డేట్ చేయాలంటూ నగరానికి చెందిన ఓ ఎన్ఆర్ఐకి ఫిషింగ్ లింక్ పంపి అతడిచ్చిన వివరాలతో రూ.8 లక్షలు కాజేశారు. ముంబై కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్, మరో ఇద్దరు ముంబై వాసులను సైబరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖతర్‌లో పనిచేస్తున్న కూకట్‌పల్లికి చెందిన ప్రవీణ్ కుమార్‌కు సికింద్రాబాద్ కార్ఖాణాలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్వో అకౌంట్లు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 31న మీ ఎన్ఆర్ఈ అకౌంట్‌ను అప్డేట్ చేయాలంటూ ఫిషింగ్ మెయిల్ వచ్చింది. ఇది అచ్చం అసలు బ్యాంక్ లింక్ మాదిరిగానే ఉండటంతో ప్రవీణ్‌కుమార్ అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసి తన వివరాలను పంపాడు. అప్పటినుంచి ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఎన్ఆర్వో అకౌంట్‌కు, అక్కడి నుంచి ముంబై, వెస్ట్ బెంగాల్‌లోని వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీలు జరిగాయి. రూ. 8 లక్షలు బదిలీ జరిగినట్లు నాలుగు ఎస్ఎంఎస్లు వచ్చాయి. దీనిపైఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించగా మోసపూరిత లావాదేవీలు జరిగాయని నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుల ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐపీ అడ్రస్, వివిధ బ్యాంక్ ఖాతాల నంబర్ల ఆధారంగా నిందితులు ముంబైలోని వాషిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికెళ్లిన పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో చినోస్ ఓజర్, ముంబైలోని బాంద్రా ఈస్ట్‌కు చెందిన అశోక్ రవి ఆరోరా, ఇమితియా సాదిక్ సయ్యద్‌లను అరెస్టు చేశారు. ముంబై, వెస్ట్‌బెంగాల్‌లోని నిందితుల బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నేరానికి ప్రధాన సూత్రధారి నైజీరియాకు చెందిన ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఫిషింగ్ లింక్‌ను పంపగా ప్రవీణ్ కుమార్ నింపిన వివరాలతో ఆ డబ్బును వివిధ ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు మరో నైజీరియన్ చినోస్ ఓజర్, రవి ఆరోరా, సాదిక్ సయ్యద్‌లు సహకరించారని పోలీసు విచారణలో తేలింది. కాగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.