ముద్దాయి ముఖ్యమంత్రేనంటున్న ప్రతిపక్షనేత
♦ ఆధారాలు ఇవ్వాల్సింది ఎవరికి?
♦ ముద్దాయికి ఆధారాలడిగే హక్కు ఉంటుందా?
♦ ఏ తప్పూ చేయకపోతే విచారణకు నిలబడవచ్చుకదా?
♦ సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు ప్రభుత్వం వెనుకంజ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికార పగ్గాలు చేపట్టిన ఇరవై నెలల వ్యవధిలో పాల్పడిన 20 రకాల కుంభకోణాలు, రాజధాని భూ దందాపై ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు పట్టుబడుతుంటే దానిని పక్కదారి పట్టించేందుకు అధికారపక్షం అడుగడుగునా ప్రయత్నించడం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యింది. ప్రతి కుంభకోణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాల గురించి సభలో ప్రస్తావిస్తున్నా ఆధారాలుంటే ఇవ్వండి పరిశీలిస్తా.. చర్యలు తీసుకుంటా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే అదే చెబుతుండటం చూసి సీనియర్ పార్లమెంటేరియన్లు విస్తుపో తున్నారు. అధికారపక్షం గానీ, ముఖ్యమంత్రి కానీ ఏ తప్పూ చేయకపోతే విచారణకు భయపడటమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఆధారాలను అడగడమేమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ముద్దాయి మీరే కదా?
‘‘అసలు ముద్దాయి మీరే. మీ పైనే ఆరోపణలున్నాయి. రాజధాని భూ దందాపైన అయితేనేమి... 20 రకాల కుంభకోణాల విషయంలో అయితేనేమి... ఆరోపణలు మీ పైనే వస్తుంటే మీరు ఆధారాలడగడమేమిటి? మీరు చర్యలు తీసుకుంటాననడమేమిటి? మీకు ధైర్యముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అయితే ఆధారాలుంటే ఇవ్వాలి లేదంటే వారిపైనే చర్యలు తీసుకోవాలి అని అధికారపక్ష సభ్యులు సభలో అనేక రకాల విమర్శలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఆధారాలు ఇవ్వడమేమిటి? ఇదొక పనికిమాలిన వాదన కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే విచారణ జరిపిస్తామంటే జనం నవ్విపోరా? ప్రతిపక్ష నేత డిమాండ్ చేసినట్లుగా సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఎందుకు అధికారపక్షం జంకుతున్నట్లు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు బైటపడతాయని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.
రాజధానిపై విచారణకు జంకెందుకు?
ఉదాహరణకు రాజధాని కుంభకోణాన్నే తీసుకుంటే.. ‘‘లింగమనేని రమేష్ భూములు పూలింగ్‌కు ఇస్తామన్నా నేనే వద్దన్నా ’’ అని స్వయంగా ముఖ్యమంత్రి మీడియా ముందు చెబుతున్నారు. ఒకపక్క రైతుల ను బెదిరించి మూడు పంటలు పండే భూములను పూలింగ్ పేరుతో లాక్కున్న ప్రభుత్వం తమ బినామీలు, అయినవారు భూములు ఇస్తామన్నా పూలింగ్‌లో తీసుకోవడం లేదు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?. ఎకరం భూమి ఇచ్చే రైతుకు కొన్ని గజాల నివాసస్థలం, వాణిజ్య స్థలం ఇచ్చి.. మీ బినామీలకు మాత్రం మొత్తం ఎకరం అంతా విలువైన భూమిగా మిగల్చడం ఏం న్యాయం బాబూ? ఇది మీకు నేరంగా అనిపించడం లేదా? రాజధాని ఎక్కడ వస్తుందో మీ మంత్రులకు, బినామీలకు ముందుగానే చెప్పి వారు అమరావతి ప్రాంతంలో భూములు కారుచౌకగా కొనుక్కున్న తర్వాత రాజధాని ప్రకటించడం నిజం కాదా? అది మీకు నేరంగా కనిపించడం లేదా? వారు డబ్బులిచ్చి భూములు కొనుక్కుంటే తప్పేమిటి అని ఇపుడు అడుగుతున్నారు. రాజధాని ప్రాంతంలో 4.09 ఎకరాల భూమి రూ. 12 లక్షలకు వస్తుందా? రాజధాని గురించి తెలియని రైతు దగ్గర కారుచౌకగా మీరు కొట్టేయడం అన్యాయం కాదా? అధికార రహస్యాలను కాపాడతానని ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరు చేసిన ప్రమాణాలకు ఇది విరుద్ధం కాదా? ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలని అడుగుతుంటే మీరు జంకుతుండడం చూస్తేనే మీరు నేరం చేశారని అర్ధం కావడం లేదూ?
ఏ తప్పూచేయకపోతే భయమెందుకు?
మీరు ఏ తప్పూ చేయలేదన్న ధైర్యం మీకు ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చుగదా? కనీసం సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించయినా మీ నిజాయితీని రుజువు చేసుకోవచ్చు కదా? సోమవారం నాడు సభలో చర్చనీయాంశంగా మార్చిన జెన్‌కో ఉదంతాన్ని తీసుకుంటే... సోలార్ టెండర్ల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందని ప్రతిపక్షం ఆరోపించడం నిజం కాదా? ఇదే తరహా బిడ్డింగ్‌లో ఎన్‌టీపీసీలో 17 మంది మిగలగా జెన్‌కోలో ఐదుగురే మిగిలారు. థర్మల్‌లో ముగ్గురు మాత్రమే మిగిలారు. మీరు కోరుకున్న కంపెనీలకే టెండర్లు దక్కడం కోసం టెయిలర్ మేడ్ నిబంధనలు తెరపైకి తీసుకువచ్చినందున ఆ విషయం బైటపడుతుందని మీరు భయపడుతున్నారు. ప్రైమాఫేసీ ఆధారాలున్నాయని ప్రతిపక్షం ఢంకా భజాయించి చెబుతోంది. ఏ తప్పూ జరక్కపోతే ప్రభుత్వం విచారణకు సిద్ధపడాలని, లేదంటే ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లేనని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ వాదిస్తోంది. విచారణకు సిద్ధపడకపోతే ప్రభుత్వ నిజాయితీని శంకించాల్సి ఉంటుందని విమర్శకులం టున్నారు.
విచారణంటే భయమెందుకు?
Published Tue, Mar 15 2016 3:08 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement