శోక సంద్రంలో ఉస్మానియా | osmania university students paid condolence to bus accident victims | Sakshi
Sakshi News home page

శోక సంద్రంలో ఉస్మానియా

Published Wed, Mar 16 2016 2:40 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

మరణించిన తోటి విద్యార్థులకు మంగళవారం ఉస్మానియా మెడికోల నివాళులు - Sakshi

మరణించిన తోటి విద్యార్థులకు మంగళవారం ఉస్మానియా మెడికోల నివాళులు

గొల్లపూడి ప్రమాదంలో మృతిచెందిన నలుగురు మెడికోలకు అశృనివాళులు
 
సాక్షి, హైదరాబాద్/విజయవాడ/లబ్బీపేట: విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఉస్మానియా వైద్య కళాశాలలో విషాదం అలముకుంది. క్రీడల్లో విజయం సాధించి తిరిగొస్తామని చెప్పి వెళ్లినవారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోడంతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. తమ కొడుకును డాక్టర్‌గా చూడాలని కలలుగన్న వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఉస్మానియా వైద్య కళాశాల నుంచి 56 మంది విద్యార్థులు ఈనెల 9న ఓ ప్రైవేట్ ట్రావె ల్స్‌కు చెందిన బస్సులో వెళ్లి, సోమవారం రాత్రి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 45 మంది విద్యార్థులున్న ఆ బస్సులో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతులను అదిలాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన జి.లక్ష్మణ్, కుత్బుల్లాపూర్ ప్రగతినగర్‌కు చెందిన ఎం.విజయ్‌తేజ, సరూర్‌న గర్‌కు చెందిన మచ్చ ప్రణయ్ రాజారామ్, కరీంనగర్ జిల్లా రాంనగర్‌కు చెందిన వొదనాల ఉదయ్‌గా గుర్తించారు.

మృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ప్రమాదంలో మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో వరంగల్‌కు చెందిన ఎస్.రాజేష్‌కుమార్, కడప జిల్లాకు చెందిన కందుల సుజిత్‌రెడ్డి పరిస్థితి విష మంగా ఉంది. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మరో నలుగురు మెడికోలు ఎన్.అంకిత్, ఎన్.అభిలాష్, ఆర్.నవనీత్ రాథోడ్, ఎం.సురేష్ గోపిలకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి వైద్య బృందం మంగళవారం మధ్యాహ్నం ఆంధ్ర ఆస్పత్రికి వెళ్లింది.

అంతకుముందే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా డీఎంఈ డాక్టర్ రమణి, ప్రిన్సిపాల్ ప్రభాకర్, ఉస్మానియా సూపరింటెండెంట్ మూర్తిలతో కూడిన బృందం అక్కడికి వెళ్లింది. స్వల్పగాయాలతో బయటపడ్డ ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్ చేరుకొని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాలేజీలో బస్సులు లేకపోవడం వల్లే..
ఉస్మానియా వైద్య కళాశాలకు ఐదు వాహనాలు ఏర్పాటు చేయాలని గతంలో ఎంసీఐ సూచిం చింది. అయితే అలాంటి ఏర్పాట్లు చేయలేదు. అలాగే వివిధ పోటీలకు వెళ్లే మెడికోల రవాణా, ఇతర ఖర్చుల కోసం ప్రిన్సిపల్ రూ.1.30 లక్షలు మంజూరు చేశారు. ఈవెంట్‌కు వారం రోజుల ముందే డబ్బును అందజేసినట్టయితే విద్యార్థులు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీని కాకుండా ఆర్టీసీ లేదా రైల్వే వంటి ప్రభుత్వ సర్వీసులను ఎంచుకునేవారని చెబుతున్నారు.

రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: టీజీడీఏ
వైద్య విద్యార్థుల మృతికి డీఎంఈ రమణి, ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీ నిర్లక్ష్యమే కారణమని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ వైద్యుల సంఘం(టీజీడీఏ) ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు మంగళవారం కళాశాలలో ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబానికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషి యా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కదిలిన ఆర్టీఏ: ప్రమాదంపై రవాణా శాఖ చర్యలకు సిద్ధమైంది. ప్రమాదానికి గురైన బస్సు ధనుంజయ్ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. దీన్ని ఏడాది క్రితమే ఒమర్ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. అప్పట్నుంచి పేరు మార్చుకోకుండానే పాత పేరుపైనే కాంట్రాక్ట్ క్యారేజీగా నడుపుతున్నారు. బస్సు నిర్వాహకులపై మోటారు వాహన నిబంధనల  ప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు.
 
డ్రైవర్ మద్యం మత్తే ప్రాణాలు తీసింది

మద్యం మత్తులో డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చా రు. ప్రమాదానికి  ముందు జరిగిన ఘటనలపై క్షతగాత్రుడైన వైద్య విద్యార్థి రాజీవ్ సిద్ధార్థ కథనం మేరకు.. సోమవారం రాత్రి బస్సులో ఉంచిన తమ బ్యాగుల్లోని పర్సులు, సెల్‌ఫోన్లు, నగదు కనిపించకపోవడం, క్లీనర్ అదృశ్యమవడంతో విద్యార్థులు డ్రైవర్‌ను నిలదీశారు. డ్రైవర్ చేత క్లీనర్‌కు ఫోన్ చేయించగా మొదట బుకాయించిన క్లీనర్.. కేసు పెడతామనడంతో విజయవాడ బస్టాండ్ సమీపంలోని కంట్రోల్‌రూం వద్దకు వచ్చి ఇచ్చేస్తానని చెప్పి అలాగే చేశాడు.

అనంతరం క్లీనర్‌ను కూడా ఎక్కించుకుని బస్సు బయలుదేరింది. బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ మద్యం తాగాడని విద్యార్థులు గుర్తించారు. దీంతో ధనుంజయ ట్రావెల్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేయాలని కోరగా సూర్యాపేటలో మారుస్తామన్నారు. అక్కడి నుంచి బస్సు మితిమీరిన వేగంతో వెళుతుండడాన్ని గమనించి ముగ్గురు విద్యార్థులు డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లి బస్సు ఆపమన్నారు. అతను ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం మొదలైంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ శివశంకర్ స్టీరింగ్‌ను ఎడమ చేతివైపు బలంగా తిప్పాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఢీకొంది. డ్రైవర్‌తోపాటు ముందు భాగాన ఉన్న ఆ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
 
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటుగా ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
 
దురదృష్టకర ఘటన
రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోలు దుర్మరణం చెందడం దురదృష్టకరమని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న మెడికోల మృతదేహాలను సందర్శించి, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందన్నారు.
 

 
 ప్రమాదానికి ముందు బస్సులో సెల్ఫీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement