వారంలోగా ఉస్మానియా ఖాళీ | osmania will shifted to private building in 7 days, says kcr | Sakshi
Sakshi News home page

వారంలోగా ఉస్మానియా ఖాళీ

Published Fri, Jul 24 2015 2:23 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

వారంలోగా ఉస్మానియా ఖాళీ - Sakshi

వారంలోగా ఉస్మానియా ఖాళీ

ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్
♦  హెరిటేజ్ కన్నా..రోగులు, వైద్యుల ప్రాణాలే ముఖ్యం
♦  పాత భవనంలో చికిత్స ఏమాత్రం సురక్షితం కాదు
♦  కొనసాగిస్తే వందల మంది చనిపోయే ప్రమాదం
♦  ఆస్పత్రి దుస్థితిపై గవర్నర్, హైకోర్టు సీజేలకు స్వయంగా వివరిస్తా
♦  వారం రోజుల్లో రోగులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల తరలింపు

సాక్షి, హైదరాబాద్: ‘ఉస్మానియా ఆస్పత్రి రోగులకు ఏమాత్రం సురక్షితం కాదు.

వారసత్వ కట్టడాల పేరుతో రోగులు, వైద్యులు, నర్సులను చంపుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయిస్తా. ఇందు కోసం అవసరమైతే గవర్నర్, హైకోర్టు సీజే, ఎంసీఐతో స్వయం గా మాట్లాడుతా. ఆస్పత్రి పరిస్థితిని వివరిస్తా’అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ రమణిలతో కలసి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రధాన భవనంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌తోపాటు ఇన్‌పేషంట్ వార్డులు, పేయింగ్ బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌ను సందర్శించారు.

పాత భవనం దుస్థితి, కొత్త భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులు.. ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని 110 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇది చాలా వరకు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. భవనం స్థితి గతులపై జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ నిపుణులతో ఇప్పటికే అధ్యయనం చేయించాం. ఇది రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని వారు స్పష్టం చేశారు. వర్షాలకు పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు, నర్సు ల తలలు పగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ రోగులను ఉంచడం క్షేమం కాదు.

రోగులను వారం రోజుల్లో ఇతర ఆస్పత్రులకు తరలిస్తాం’ అని సీఎం అన్నారు. ‘వైద్య విద్యార్థులు, నర్సులు, వైద్యులకు ఇబ్బంది కలగకుండా మెడికల్ కాలేజీకి సమీపంలోనే ఏదైనా ప్రైవేటు భవ నం అద్దెకు తీసుకుని వీరందరిని అందులోకి షిఫ్ట్ చేస్తాం. మెడికల్ సీట్లకు ఇబ్బంది కలగకుండా ఎంసీఐ అనుమతి కూడా తీసుకుంటాం. అడ్డం కులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిస్థితిని వివరిస్తాం. ఆస్పత్రిని సందర్శించాల్సిందిగా వారిని కోరుతాం. వారసత్వ కట్టడాల జాబితా నుంచి భవనాన్ని తొలగింపజేసే ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టాం.

అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగిన  ఉస్మానియా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా శిథిలమైంది’ కేసీఆర్ వివరించారు. ‘రోగుల సౌకర్యార్థం ఇక్కడే ట్విన్ టవర్స్ నిర్మించాలని నిర్ణయించాం. వైద్యులు, అధికారులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం. గచ్చిబౌలిలో ఒక ప్రభుత్వ భవనం ఉంది. దాన్ని శుక్రవారం సందరిస్తాను.’ సీఎం పేర్కొన్నారు. సీఎం వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘురామ్, ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నాగేం దర్, తెలంగాణ వైద్యుల సంఘం బి.రమేష్ ఉన్నారు.  వైద్యం సరిగా అందడంలేదని శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న అనురాధ సీఎంకు ఫిర్యాదు చేయగా, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
 
ఫీవర్‌కు ఉస్మానియా జనరల్ మెడిసిన్ : లక్ష్మారెడ్డి
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని పురాతన భవనంలో ఉన్న జనరల్ మెడిసిన్ విభాగాన్ని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి మార్చనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలోని పురాతన భవనంలో ఉన్న 870 పడకల్లో 150 నుంచి 200 పడకలను ఫీవర్‌కు తరలిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి గురువారం సాయంత్రం ఫీవర్ ఆసుపత్రిని సందర్శించారు. ఏ విభాగాన్ని పీవర్‌కు తరలిస్తే బాగుంటుందనే విషయాలను డీఎంఈ రమణి, ఫీవర్ సూపరింటెండెంట్ కె.శంకర్, సీఎస్ ఆర్‌ఎంఓ చిత్రలేఖ తదితరులతో మంత్రి చర్చించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement