
భూముల కొనుగోలు మా అధికారం
మల్లన్నసాగర్ కేసులో హైకోర్టుకు సర్కార్ నివేదన
సాక్షి, హైదరాబాద్: భూములను అమ్మేందుకు ముందుకొచ్చిన వారికి డబ్బులిచ్చి కొనుగోలు చేసే విషయంలో తమపై ఎలాంటి నిషేధమూ లేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ‘‘ప్రజోపయోగ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చట్టవిరుద్ధం కాదు. ఆ అధికారం ప్రభుత్వానికుంది. 299వ అధికరణ ప్రకారం ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవచ్చని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భూయజమానులకు ఇబ్బంది, నష్టం లేకుండా వారి భూములను సేకరించవచ్చు. మల్లన్నసాగర్ కోసం భూములమ్మేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారి నుంచి ఇందుకు అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నాం.
వారికి 2013 భూ సేకరణ చట్టం కింద కంటే అధిక పరి హారం చెల్లిస్తున్నాం. భూములమ్మేందుకు ముందుకు రానివారి నుంచి భూసేకరణ చట్టం కింద తగిన పరిహారం చెల్లించి తీసుకుంటాం’’ అని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూముల కొనుగోలును సవాలు చేస్తూ భూ యజమానులు, వాటిపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు వేసిన వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధా న కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. పిటిషనర్ల ఆరోపణ లు నిరాధారమని పేర్కొన్నారు. ‘‘భూములమ్మేందుకు ముందుకొచ్చిన వారి నుంచి, వారికి సంతృప్తికరమైన మొత్తాలు చెల్లించే కొనుగోలు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టుకు భూములను సేకరించే ఉద్దేశంతోనే జీవో 123 జారీ చేశాం. జీవో 123 ప్రకారం భూములు తీసుకోవడం ద్వారా ప్రభావితులయ్యే వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం జీవోలు 190, 191 జారీ చేశాం’’ అని వివరించారు.
123 జీవో తప్పొప్పులు
ఇప్పుడే చెప్పలేం: ధర్మాసనం
మల్లన్నసాగర్ భూముల కొనుగోలుకు జారీ చేసిన జీవో 123 చట్టబద్ధతను తేల్చకుండా దీనిపై ఓ అభిప్రాయానికి రావడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా ఆ జీవో జారీ తప్పని గానీ, ఒప్పని గానీ ప్రస్తుతానికి ఎటువంటి సర్టిఫికెటూ ఇవ్వడం లేదంది. ‘‘హైకోర్టును ఆశ్రయించిన వారి నుంచి భూములు కొనుగోలు చేయబోమని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినందున పిటిషనర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. భూముల కొనుగోలుపై అభ్యంతరాలున్న వారిని కోర్టుకు రాకుండా ఎవరూ అడ్డుకోవడం లేదు’’ అని తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తామేం చేసినా చెల్లుతుందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన బి.రచనారెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి కాగితాలపై సంతకాలు తీసుకుంటోందంటూ ఆవేశంగా చెప్పగా, ‘‘ఇది ప్రసంగాలు చేసేందుకు వేదిక కాదు. ఎవరేం చెప్పాలనుకున్నా అఫిడవిట్ రూపంలో మా ముందుంచండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఏజీ అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
144 సెక్షన్‌పై వివరణ ఇవ్వండి...
మెదక్ జిల్లా వేములఘాట్‌లో 35 రోజులుగా 144 సెక్షన్ విధించడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందుంచాలంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.