
మాది విడదీయరాని బంధం
♦ దర్శకేంద్రుడితో మూడున్నర దశాబ్దాల అనుబంధం: చిరంజీవి
♦ రాఘవేంద్రరావుకు ‘అల్లు’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో నాకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉంది. మాది విడదీయరాని అనుబంధం. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారమిక్కడ ‘సాంస్కృతిక బంధు’ సారపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ‘అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం 2015’ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవి ఆయనకు స్వర్ణకంకణం, స్వర్ణ కిరీటంతో పాటు పురస్కారాన్ని అందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్యకు ఎంతో ఆప్తుడైన రాఘవేంద్రరావుకు ఈ అవార్డు ఇవ్వడం ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. దర్శకేంద్రుడు ఈ అవార్డుకు మరింత వన్నె తెచ్చారన్నారు. ‘అడవిదొంగ సినిమాతో రాఘవేంద్రరావు నన్ను మాస్ హీరోగా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేయడంతోపాటు ఇండస్ట్రీలో నా సత్తా పెంచారు. ఆయనతో 12 సినిమాలు చేసిన ఘనత ఎన్‌టీఆర్‌కు, నాకు దక్కింది. ఆయన కంటే చిన్నవాడిని అయినా నన్ను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అల్లుగారు హాస్యనటుడిగా అందరికీ తెలుసు.
కానీ ఆయన గాంధీ స్ఫూర్తితో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నది చాలామందికి తెలియదు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని, ఏపీ మంత్రులు గంటా, కామినేని, నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వినీదత్, రచయిత పరుచూరి వెంకటేశ్వరావు, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, చిరంజీవి సతీమణి సురేఖ, ప్రముఖులు పి.సుధాకర్ రెడ్డి, తెల్లంపల్లి శ్రీనివాస్, గాయని శారద, వాశిరాజు ప్రకాశం, రాంబాబు, జెఎస్‌టీ సాయి పాల్గొన్నారు.