‘మెయింటెనెన్స్‌’ మారితేనే...సేఫ్‌ జర్నీ! | Outer Ring Road a special focus on the marking | Sakshi
Sakshi News home page

‘మెయింటెనెన్స్‌’ మారితేనే...సేఫ్‌ జర్నీ!

Published Tue, Feb 7 2017 12:07 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

‘మెయింటెనెన్స్‌’ మారితేనే...సేఫ్‌ జర్నీ! - Sakshi

‘మెయింటెనెన్స్‌’ మారితేనే...సేఫ్‌ జర్నీ!

అవుటర్‌ రింగురోడ్డులో మార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఆప్టికల్‌ స్పీడ్‌ బార్స్, డబుల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్స్‌ ఏర్పాటు చేయాలి
వాహనాల జెట్‌ స్పీడ్‌ వేగానికి కళ్లెం వేయాలి
ఈ చర్యల ద్వారానే ప్రమాదాలకు అడ్డుకట్ట
సీఆర్‌ఆర్‌ఐ నివేదికలో సూచనలు


సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలకు కారణం జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లే వాహనాలని చెప్పొచ్చు. అయితే వాహనదారుల వేగం ఒక్కటే కాదు...అటువంటి ప్రమాదాలను సాధ్యమైనంతగా అరికట్టేందుకు ఓఆర్‌ఆర్‌ మెయింటెనెన్స్‌ కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓఆర్‌ఆర్‌పై రోడ్డు సేఫ్టీ ఆడిట్‌ చేసిన న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఆర్‌ఆర్‌ఐ) ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక చెబుతోంది. 156.8 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లోని జాతీయ రహదారులను అనుసంధానించే మార్గాలతో పాటు ట్రాఫిక్‌ ఎక్కువగా జామ్‌ అయ్యే ప్రాంతాలు, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 29 ప్రాంతాల్లో వాహనాల వేగంతో పాటు ఓఆర్‌ఆర్‌ మెయిన్‌టెనెన్స్‌పై గతేడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు దాదాపు మూడు నెలల పాటు అధ్యయనం చేసి పలు సూచనలు చేసింది. మీడియన్‌ ట్రీట్‌మెంట్, రోడ్డు మార్క్‌లు, రోడ్డు సైన్‌బోర్డులు, ఎంట్రీ, ఎగ్జిట్‌ లోకేషన్‌లు, మీడియా ప్లాంటేషన్‌లో చేయాల్సిన మార్పులతో పాటు ఓఆర్‌ఆర్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది వ్యక్తిగత భద్రత కోసం జాకెట్లు, హెల్మెట్లు ధరించాలని సూచించింది.

 ‘ఆప్టికల్‌ స్పీడ్‌ బార్స్‌’తో అప్రమత్తం..
సెంట్రల్‌ మీడియన్‌కు చుట్టుపక్కలతో పాటు ఎడమ, కుడివైపుల ఉండే మార్గాల్లో అప్టికల్‌ స్పీడ్‌ బార్స్‌ను ఏర్పాటుచేయడం  రోడ్డు ప్రమాదాలను తగ్గించే అవకాశముంది. ఏడున్నర నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల వరకు వేసే థర్మోప్లాస్ట్‌ పెయింటింగ్స్‌తో ఈ మార్గాల్లో రాత్రి వేళ వేగంతో వచ్చే వాహనాల లైట్‌ వెలుతురు వీటిపై పడటం వల్ల అప్టికల్‌ స్పీడ్‌ బార్స్‌ మెరిసి అటువైపుగా వాహనాలు వెళ్లకుండా ఉండేలా చూస్తోంది. దీంతో పాటు వాటికి దగ్గర్లోకి వాహనాలు వెళుతున్నప్పుడు బాగా సౌండ్‌ రావడం వల్ల వాహనదారుడు అప్రమత్తమై సరైన దారిలో వాహనాన్ని తీసుకెళ్లే అవకాశముంటుంది.

‘టిపికల్‌’ ప్రమాదాలను ఆపేస్తుంది...
ఓఆర్‌ఆర్‌పై చాలా వాహనాలు మితిమీరిన వేగంతో అదుపుతప్పి స్తంభాలను ఢీకొట్టి అవతల ఉన్న సర్వీస్‌ రోడ్డుపై ఎగిరిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఓఆర్‌ఆర్‌ అంతటా మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్‌ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఈ మార్గంలో మెటల్‌ బీమ్‌ క్రాష్‌ ఒకేతీరున ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వాహనాలు వాటిని ఢీకొట్టి అవతల ఎగిరిపడుతున్నాయని పేర్కొంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాహనాలు తిరిగి యథాస్థానంలోనే ఉండేందుకు ‘టిపికల్‌ డబుల్‌ మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్స్‌’ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రస్తుతమున్న మాదిరిగానే మీడియన్‌ సైడ్‌ కర్వ్‌ దగ్గర అమర్చాలంది.

డైరెక్షనల్‌‘మార్కింగ్‌’సరిగా లేదు ...
ఓఆర్‌ఆర్‌లోని చాలా ప్రాంతాల్లో వాహనాలు వెళ్లే మార్గాన్ని సూచించే ‘డైరెక్షనల్‌ మార్కింగ్‌’ గుర్తులు సరిగా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడూ పెయింటింగ్‌ వేయకపోవడంతో అవి సరిగా కనపడక కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది. చిన్నచిన్నపాటి ఇటువంటి పనుల్లో నిర్లక్ష్యంతో భారీ ప్రమాదాలు జరుగుతాయని పేర్కొంది. అందుకే  ‘డైరెక్షనల్‌ మార్కింగ్‌’లు అందరికీ స్పష్టంగా కనిపించేలా ఎప్పటికప్పుడు పెయింటింగ్‌ వేస్తూ రోజువారీ పర్యవేక్షణ ఉంచాల్సిన అవసరముందని సూచించింది. అలాగే రోడ్డు స్టాడ్‌ (రైజ్డ్‌ పేవ్‌మెంట్‌ మార్కర్‌)లు ఒక్కో లేన్‌ మీద స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. రోడ్డు సైన్‌లు మరింత స్పష్టంగా కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ ఎత్తు ఎక్కువ పెంచడం వల్ల వాహనచోదకులకు సరిగా కనబడే అవకాశముండి జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేసే అవకాశముంటుంది.    
 ఎగ్జిట్, ఎంట్రీల వద్ద సవరైన్‌ సైన్స్‌ ఉండాలి...
ఓఆర్‌ఆర్‌లోకి ప్రవేశించి ఎంట్రీతో పాటు ఎగ్జిట్‌ ప్రాంతాల్లోని రోడ్లపై సవరన్‌ సైన్‌లు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాచోదకులకు దూరం నుంచి ఈ సైన్‌లు గుంతలాగా కనబడటంతో నిదానంగా ముందుకెళ్లి తమ మార్గంలోకి వెళ్లే అవకాశముంటుంది. చాలా మంది ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్‌లోనూ అతి వేగంతో దూసుకెళుతున్నట్టుగా గుర్తించిన సీఆర్‌ఆర్‌ఐ సిబ్బంది సవరైన్‌ సైన్‌ల సూచనను ముందుంచింది.  

ఆ మార్గంలో జెట్‌ స్పీడ్‌ను మించేలా...
ఓఆర్‌ఆర్‌ మొత్తంగా ఎక్స్‌ప్రెస్‌ వే మీద ప్యాసింజర్‌ కారు యూనిట్లు కలుపుకొని మొత్తం 82 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టుగా గుర్తించారు. ఒక్క శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి మార్గంలో 50 వేల కార్లు రోజూ నడుస్తున్నాయి. ఈ మార్గంలో కార్లు 139 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. ఓఆర్‌ఆర్‌ కిలోమీటర్‌ 69, 137, 88 కిలోమీటర్ల వద్ద ప్రాంతాల వద్ద వాహనాలు అతివేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. శామీర్‌పేట నుంచి కీసర మార్గంలోని ఓఆర్‌ఆర్‌లోని లియోనియా రిసార్ట్‌ సమీప ప్రాంతంలో పెద్ద కార్లు 208 కిలోమీటర్ల వాయు వేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. ఇక్కడ పెద్దకార్లు 208 కిలోమీటర్లు వెళితే, చిన్నకార్లు 180 కిలోమీటర్లు, లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ 111 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. అతి వేగంతో బండి నడిపిన డ్రైవర్లు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. ‘ఎక్స్‌ట్రీమ్‌ లెఫ్ట్‌లో ఉన్న రెండు లేన్లపై లారీలు వెళ్లడటం ఉత్తమం. ఎక్స్‌ట్రీమ్‌ రైట్‌ మీడియన్‌కు పక్కన ఉండే లేన్‌లో అధిక వేగంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు వెళ్లాలి. మూడో లేన్లలో తక్కువ వేగంతో అంటే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు వెళ్లేలా చూడాలని సూచించింద’ని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement