‘ఔటర్’ స్పీడ్.. 100 కి.మీ.
‘ఔటర్’ స్పీడ్.. 100 కి.మీ.
Published Fri, May 26 2017 1:36 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఔటర్ రింగ్ రోడ్‌పై వేగానికి కళ్లెం
- నోటిఫికేషన్ విడుదల చేసిన సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై వాహనాల జెట్ స్పీడ్‌కు కళ్లెం పడింది. మితిమీరిన వేగం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఓఆర్‌ఆర్‌పై అమల్లో ఉన్న అధిక వేగం గంటకు 120 కిలోమీటర్లను 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఓఆర్‌ఆర్‌లో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సూచనలు చేసిన ఆయన.. వీటి అమలులో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఆపేదిలా..
వాహనాలను ఓఆర్‌ఆర్‌పై గల నాలుగు లేన్లలో నిలుపరాదు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలిపేందుకు కొంత వెసులుబాటు కల్పించారు. ఈ వాహనాలు పూర్తిగా ఎడమవైపు అత్యవసర లేన్‌పైనే ఆపాలి. ఇతర వాహనాలకు కనపడేందుకు వీలుగా పార్కింగ్ లైట్లను వేసుకోవాలి. వాహనం ముందు, వెనుక వైపు ఐదు మీటర్ల దూరంలో రేడియం గుర్తులు, అక్కడ అందుబాటులో ఉండే కొన్లను పెట్టాలి.
ఆ మూడు చోట్లే ఎక్కువగా..
శంషాబాద్ మార్గంలోని అప్పా, నానక్‌రామ్‌గూడ, కొల్లూరు వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఔటర్‌పై రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 33 మంది మృతిచెందగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 15 మంది మరణించారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఓఆర్‌ఆర్ మార్గంలో ఇటీవల వాహనాలను ఎక్కడపడితే అక్కడ ఆపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు లేన్లను దాటే క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పాసింజర్ వెహికల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఓఆర్‌ఆర్ స్ట్రెచ్ మార్గంలో పాదచారులు కూడా నడవొవద్దని నిషేధం విధించారు. రూ.52 లక్షల వ్యయంతో హెచ్‌ఎండీఏ అందించిన 5 స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు, 13 బ్రీత్ అనలైజర్లతో పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచనున్నారు.
ఎగ్జిట్ వద్ద చలాన్ చేతికి..
హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(హెచ్‌టీఎంఎస్) ద్వారా ప్రతిదీ పర్యవేక్షించడంతో పాటు ప్రమాదాలు నియంత్రించేలా.. వాహనదారులు లేన్ డిసిప్లేన్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ, నోయిడా మాదిరిగా ఓఆర్‌ఆర్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వాహనం వేగం నిబంధనలు అతిక్రమిస్తే ఎగ్జిట్ వద్ద సదరు వాహనదారుడి చేతికి చలాన్ అందించనున్నారు. మరో ఏడు నెలల్లో అందుబాటులోకి రానున్న హెచ్‌ఎంటీఎస్‌తో ఓఆర్‌ఆర్‌ను ప్రమాదరహితంగా మార్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.
40 కి.మీ. తగ్గితే నో ఎంట్రీ..
ఓఆర్‌ఆర్‌పై కుడివైపు గల లేన్–1, లేన్–2ల్లో వాహనాల గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. కనిష్ట వేగం గంటకు 80 కి.మీ. లేన్–3, లేన్–4ల్లో గరిష్ట వేగం 80 కి.మీ. కనిష్ట వేగం గంటకు 40 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లాలి. భారీ వాహనాలు లేన్–3, లేన్–4లో మాత్రమే వెళ్లాలి. గంటకు 40 కి.మీ. కన్నా తక్కువ వేగంతో నడిచే వాహనాలను ఓఆర్‌ఆర్‌పై అనుమతించరు. నిర్దేశించిన వేగాన్ని అధిగమించిన వాహనాలపై స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో కన్నేసి జరిమానా విధిస్తారు.
Advertisement
Advertisement