CP Sandeep Shandilya
-
బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే
హైదరాబాద్: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు. స్పాలకు నిబంధనలు స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్‌లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు. పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఔటర్’ స్పీడ్.. 100 కి.మీ.
ఔటర్ రింగ్ రోడ్‌పై వేగానికి కళ్లెం - నోటిఫికేషన్ విడుదల చేసిన సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనాల జెట్ స్పీడ్‌కు కళ్లెం పడింది. మితిమీరిన వేగం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఓఆర్ఆర్పై అమల్లో ఉన్న అధిక వేగం గంటకు 120 కిలోమీటర్లను 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఓఆర్ఆర్లో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సూచనలు చేసిన ఆయన.. వీటి అమలులో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆపేదిలా.. వాహనాలను ఓఆర్ఆర్పై గల నాలుగు లేన్లలో నిలుపరాదు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలిపేందుకు కొంత వెసులుబాటు కల్పించారు. ఈ వాహనాలు పూర్తిగా ఎడమవైపు అత్యవసర లేన్పైనే ఆపాలి. ఇతర వాహనాలకు కనపడేందుకు వీలుగా పార్కింగ్ లైట్లను వేసుకోవాలి. వాహనం ముందు, వెనుక వైపు ఐదు మీటర్ల దూరంలో రేడియం గుర్తులు, అక్కడ అందుబాటులో ఉండే కొన్లను పెట్టాలి. ఆ మూడు చోట్లే ఎక్కువగా.. శంషాబాద్ మార్గంలోని అప్పా, నానక్‌రామ్‌గూడ, కొల్లూరు వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఔటర్‌పై రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 33 మంది మృతిచెందగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 15 మంది మరణించారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఓఆర్ఆర్ మార్గంలో ఇటీవల వాహనాలను ఎక్కడపడితే అక్కడ ఆపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు లేన్లను దాటే క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పాసింజర్ వెహికల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఓఆర్ఆర్ స్ట్రెచ్ మార్గంలో పాదచారులు కూడా నడవొవద్దని నిషేధం విధించారు. రూ.52 లక్షల వ్యయంతో హెచ్ఎండీఏ అందించిన 5 స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు, 13 బ్రీత్ అనలైజర్లతో పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ను పెంచనున్నారు. ఎగ్జిట్ వద్ద చలాన్ చేతికి.. హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్(హెచ్‌టీఎంఎస్) ద్వారా ప్రతిదీ పర్యవేక్షించడంతో పాటు ప్రమాదాలు నియంత్రించేలా.. వాహనదారులు లేన్ డిసిప్లేన్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ, నోయిడా మాదిరిగా ఓఆర్ఆర్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వాహనం వేగం నిబంధనలు అతిక్రమిస్తే ఎగ్జిట్ వద్ద సదరు వాహనదారుడి చేతికి చలాన్ అందించనున్నారు. మరో ఏడు నెలల్లో అందుబాటులోకి రానున్న హెచ్ఎంటీఎస్తో ఓఆర్ఆర్ను ప్రమాదరహితంగా మార్చే వీలుందని అధికారులు చెబుతున్నారు. 40 కి.మీ. తగ్గితే నో ఎంట్రీ.. ఓఆర్ఆర్పై కుడివైపు గల లేన్–1, లేన్–2ల్లో వాహనాల గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. కనిష్ట వేగం గంటకు 80 కి.మీ. లేన్–3, లేన్–4ల్లో గరిష్ట వేగం 80 కి.మీ. కనిష్ట వేగం గంటకు 40 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లాలి. భారీ వాహనాలు లేన్–3, లేన్–4లో మాత్రమే వెళ్లాలి. గంటకు 40 కి.మీ. కన్నా తక్కువ వేగంతో నడిచే వాహనాలను ఓఆర్ఆర్పై అనుమతించరు. నిర్దేశించిన వేగాన్ని అధిగమించిన వాహనాలపై స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో కన్నేసి జరిమానా విధిస్తారు.