బరిలో 13 మంది అభ్యర్థులు... టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (గంట సమయాన్ని అదనంగా పెంచారు) పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని 243 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది.
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరఫున దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితా రెడ్డి పోటీలో ఉన్నారు. ఆమెకు టీడీపీ, వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించి ప్రచారం నిర్వహించాయి. సీపీఎం అభ్యర్థిగా సీపీఐ మద్దతుతో పోతినేని సుదర్శన్ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి కె.తారక రామారావు వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలోని 4 మండలాల్లో విసృ్తతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, ఇతర మాజీ మంత్రులు ప్రచారం చేశారు. సుచరితారెడ్డికి మద్దతు ప్రకటించిన టీడీపీ, వైఎస్సార్ సీపీ తెలంగాణ నాయకులు కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీలు విజయంపై ధీమాగా ఉన్నాయి. ఈ నెల 19న ఫలితాలు వెలువడనున్నాయి.
వేసిన ఓటు చూసుకునే అవకాశం..
ఎన్నికల సంఘం తొలిసారిగా పాలేరులో వీవీప్యాట్ (ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఓటర్లకు తాము వేసిన ఓటును ప్రింట్ ద్వారా చూసుకునే అవకాశం కలగనుంది. మొత్తం 243 పోలింగ్ కేంద్రాల్లో ఈ పరికరాలను ఏర్పాట్లు చేశారు.12 మోడల్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 2,698 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గం లో 100 అతిసున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నట్లు అధికారులు గుర్తిం చారు. ఇక్కడ ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 41 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఎన్నికల తీరు ను పరిశీలిస్తాయి. ఎనిమిది వీడియో నిఘా బృందాలు ఎన్నికల తీరును రికార్డు చేయనున్నాయి.
పాలేరు పోరు నేడే
Published Mon, May 16 2016 3:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement