పార్కులు కిటకిట
►వేసవి సెలవులతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కులకు క్యూ
►సాధారణ రోజుల్లో 10 వేల మంది సందర్శన
►ఆదివారం 26 వేల మందికి పైగా వచ్చారన్న అధికారులు
సిటీబ్యూరో: నగరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పార్కులకు సందర్శకుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు రావడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వీకెండ్ శని, ఆదివారాల్లో నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్యపార్కు, హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుల దారిపడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఐదు గంటల తర్వాత పార్కులు కళకళలాడుతున్నాయి. గత సోమవారం నుంచి గురువారం వరకు ఈ పార్కుల్లో ప్రతిరోజూ పదివేల మంది సందర్శకులు వస్తే శనివారం 17 వేల మంది, ఆదివారం మాత్రం దాదాపు 26 వేలకుపైగా మంది వచ్చారని పార్కుల పర్యవేక్షకులు తెలిపారు. ఈ ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్‌కు 11,326 మంది, లుంబినీ పార్కుకు 10,925 మంది, సంజీవయ్య పార్కుకు 2,582 మంది సందర్శకులు వచ్చారన్నారు. లేజర్ షోను 1,698 మంది వీక్షించారని తెలిపారు. ఈ ఒక్కరోజే దాదాపు రూ.ఆరు లక్షలకు పైగా ఆదాయం కేవలం ఎంట్రీ టికెట్ల రూపంలో లభించిందన్నారు. లుంబినీ పార్కుకు వచ్చిన సందర్శకులు పిల్లలతో కలిసి బోటింగ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.
జెండా వచ్చాక పెరిగిన సందర్శకులు...
నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో గతేడాది జూన్‌లో దేశంలోనే అతి పెద్దదైన జాతీయ జెండాను ఆవిష్కరించాక పర్యాటకుల సందడి పెరిగింది. అంతకుముందు ప్రతిరోజూ 500 నుంచి 600 మంది సందర్శకులు వస్తే ఇప్పుడూ ఆ సంఖ్య రెట్టింపైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులు హుస్సేన్‌సాగర్ తీరంలో రెపరెపలాడుతున్న ఈ జాతీయ జెండాను వీక్షించేందుకు మక్కువ చూపెడుతున్నారు. దీనికితోడు రోజ్ గార్డెన్ కూడా ఉండటంతో వేసవిలో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.