NTR Garden
-
హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ ఆపరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ -
డిసెంబర్ నాటికి అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి
ఖైరతాబాద్: నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో నిర్మించ తలపెట్టిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ తయారీ పనులను సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శాసన సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న గౌరవమన్నారు. డిసెంబర్ నాటికి విగ్రహ తయారీ పనులు పూర్తవుతాయన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. అందుకు అనుకూలంగా తెలంగాణ శాసనమండలి తీర్మానం హర్షనీయమన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇదే అంశంపై బీజేపీ పాలిత రాష్ట్రాల వైఖరిని వెల్లడించాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రులు తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు తప్పితే దళితుల ఇంట్లో అన్నం తినలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం తప్ప దళిత వర్గాలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, చిరుమర్తి లింగయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
భారీగా పడిపోయిన ప్రభుత్వ ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్ వచ్చిందంటే చాలు... ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడతాయి. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. నగరవాసులే కాకుండా సిటీకి వచ్చే పర్యాటకులూ ఈ ప్రాంతాలను చూడకుండా వెళ్లరు. అయితే రెండు నెలలుగా ఈ వినోద కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఆదివారం కేవలం 5వేల మంది సందర్శకులు మాత్రమే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ)కి ఆదాయం తగ్గిపోయింది. దీనికి కారణం ఆయా వినోద కేంద్రాల్లోని ఎంటర్టైన్మెంట్ హౌస్‌ల టెండర్లు రద్దు చేయడమే. పిల్లలకు వినోదాన్నిచ్చే ఆయా ప్రాంతాల్లోని బోటింగ్, ట్రైన్, మచాన్ ట్రీ, హంటెడ్ హౌస్, క్యాంటీన్లు, టవర్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సిటీజనులు కోరుతున్నారు. లేని పక్షంలో సందర్శకులు తగ్గడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ దృష్టిసారించి తగిన పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదాయం ఢమాల్... హుస్సేన్‌సాగర్, దాని చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం 2000 డిసెంబర్ 12న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీని కింద లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, పీవీ జ్ఞాన్ భూమి తదితర ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలను వారానికి లక్ష మంది వరకు సందర్శిస్తుంటారు. వారాంతాల్లో అయితే తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ నుంచి ఆయా ప్రాంతాల్లోని వినోద కేంద్రాలు, క్యాంటీన్స్ బంద్ కావడంతో సందర్శకులు సంఖ్య గణనీయంగా తగ్గింది. జూన్, జూలైలో సందర్శకుల సంఖ్య వారానికి 15వేలు కూడా దాటలేదని ఆ విభాగ సిబ్బందే పేర్కొంటున్నారు. కొంతమంది అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో పార్కుల ఆదాయం భారీగా తగ్గిందని వాపోతున్నారు. ‘జూన్ నుంచి టెండర్లు రద్దు చేయడంతో ప్రతి నెలా అద్దె రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రావట్లేదు. లుంబినీ పార్క్ నుంచి రూ.20 లక్షలు, ఎన్టీఆర్ గార్డెన్లో రూ.50 లక్షలు, నెక్లెస్ రోడ్లో రూ.10 లక్షలు, పీపుల్స్ ప్లాజాలో రూ.15 లక్షల వరకు వచ్చే ఆదాయం పోతోంది. సాధారణంగా కొత్త టెండర్లు వచ్చే వరకు పాత వాటిని కొనసాగిస్తుంటారు. కానీ బీపీపీఏ అధికారులు మాత్రం టెండర్లను రద్దు చేశారు. ఫలితంగా ఆయా సంస్థల నుంచి వచ్చే అద్దెతో పాటు సందర్శకులు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింద’ని ఓ యజమాని పేర్కొన్నాడు. రోడ్డున పడిన కూలీలు... వినోద కేంద్రాలు, ఆట వస్తువుల వెండర్ నిర్వాహకులు 30 మంది వరకు ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు లేకపోవడంతో వెండర్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా వెండర్లలో సుమారు 300 మంది పని చేస్తుంటారు. కార్యకలాపాలు లేకపోవడంతో క్యాంటీన్, టవర్, టాయ్ ట్రెయిన్ తదితర రద్దు చేశారు. దీంతో వాటిల్లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. దినసరి కూలీ లేక ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే అర్ధంతరంగా రద్దు చేసిన టెండర్ల స్థానంలో కొత్త వాటిని ఆహ్వనించినా ఆశించిన ఫలితం ఉండకపోవడంతో ఆయా విభాగాధికారులు తల పట్టుకుంటున్నారు. పిల్లలను ఆపేదెలా? మా అన్నయ్య పిల్లలతో కలిసి ఎన్టీఆర్ గార్డెన్‌కు వచ్చాం. అయితే గతంలో వారు వచ్చినప్పుడున్న ట్రైన్, హంటెడ్ హౌస్ లేకపోవడంతో వారిని ఆపలేకపోయాం. అందులోకి వెళ్తామంటూ ఏడ్వడంతో వారిని బుజ్జగించేందుకు చాలా సమయమే పట్టింది. తర్వాత ఐస్‌క్రీమ్ కావాలని మారాం చేయడగా.. అక్కడ క్యాంటీన్‌కు వెళ్లి చూస్తే మూసేసి ఉంది. ఎన్టీఆర్ గార్డెన్లో ఏమీ అందుబాటులో లేకపోవడంతో పిల్లలతో వచ్చిన కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. – శ్రీనివాస్, రామచంద్రపురం -
పార్కులు కిటకిట
►వేసవి సెలవులతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కులకు క్యూ ►సాధారణ రోజుల్లో 10 వేల మంది సందర్శన ►ఆదివారం 26 వేల మందికి పైగా వచ్చారన్న అధికారులు సిటీబ్యూరో: నగరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పార్కులకు సందర్శకుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు రావడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వీకెండ్ శని, ఆదివారాల్లో నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్యపార్కు, హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుల దారిపడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఐదు గంటల తర్వాత పార్కులు కళకళలాడుతున్నాయి. గత సోమవారం నుంచి గురువారం వరకు ఈ పార్కుల్లో ప్రతిరోజూ పదివేల మంది సందర్శకులు వస్తే శనివారం 17 వేల మంది, ఆదివారం మాత్రం దాదాపు 26 వేలకుపైగా మంది వచ్చారని పార్కుల పర్యవేక్షకులు తెలిపారు. ఈ ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్‌కు 11,326 మంది, లుంబినీ పార్కుకు 10,925 మంది, సంజీవయ్య పార్కుకు 2,582 మంది సందర్శకులు వచ్చారన్నారు. లేజర్ షోను 1,698 మంది వీక్షించారని తెలిపారు. ఈ ఒక్కరోజే దాదాపు రూ.ఆరు లక్షలకు పైగా ఆదాయం కేవలం ఎంట్రీ టికెట్ల రూపంలో లభించిందన్నారు. లుంబినీ పార్కుకు వచ్చిన సందర్శకులు పిల్లలతో కలిసి బోటింగ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. జెండా వచ్చాక పెరిగిన సందర్శకులు... నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో గతేడాది జూన్‌లో దేశంలోనే అతి పెద్దదైన జాతీయ జెండాను ఆవిష్కరించాక పర్యాటకుల సందడి పెరిగింది. అంతకుముందు ప్రతిరోజూ 500 నుంచి 600 మంది సందర్శకులు వస్తే ఇప్పుడూ ఆ సంఖ్య రెట్టింపైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులు హుస్సేన్‌సాగర్ తీరంలో రెపరెపలాడుతున్న ఈ జాతీయ జెండాను వీక్షించేందుకు మక్కువ చూపెడుతున్నారు. దీనికితోడు రోజ్ గార్డెన్ కూడా ఉండటంతో వేసవిలో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
పార్కుల్లో భద్రతపై ఆరా..!
లుంబినీ, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కును పరిశీలించిన నిఘా బృందం అన్ని పార్కుల్లో బయటపడ్డ భద్రతా లోపాలు సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలో నిత్యం సందర్శకులతో కిటకిటలాడే లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రజాభద్రతపై పోలీసు అధికారుల నిఘా బృందం లోతుగా అధ్యయనం చేసింది. లష్కరే తోయిబా, హిజుబుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు మెట్రోపాలిటన్ నగరాల్లో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సాగర్ పరిసరాల్లో సందర్శనీయ ప్రాంతాలైన పార్కుల ను బుధ, గురువారాల్లో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లుంబినీ, ఎన్టీఆర్గార్డెన్, సంజీవయ్య పార్కుల్లోని భద్రతాపరమైన అనేక లోపాలు బయటపడ్డాయి. లుంబిని లేజర్ షో ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిఘా బృందం గుర్తించింది. గతంలో ఇక్కడ తీవ్రవాదులు జరిపిన మారణ హోమంలో 11 మంది అసువులుబాసినా హెచ్ఎండీఏ ప్రజాభద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక పోవడాన్ని పోలీసు అధికారులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ వెనుక సెక్రటేరియట్ వైపు ఉన్న గుడిసెలను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. వీఐపీల కదలికలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుపక్కనే ఉన్న గుడిసెల వల్ల ముప్పు ఉందని నిఘా అధికారులు భావిస్తున్నారు. అలాగే ఐమాక్స్ థియేటర్ వెనుక వైపున ఫెన్షింగ్ పటిష్టంగా లేకపోవడాన్ని నిఘా అధికారులు గుర్తించారు. ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి, అలాగే గార్డెన్ నుంచి థియేటర్ వైపునకు వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండటంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న సంజీవయ్య పార్కులో తగినన్ని సీసీ కెమెరాలు లేని విషయాన్ని, అలాగే సాగర్ గట్టు వెంట నిర్మించిన రెయిలింగ్ ఎత్తు చాలా తక్కువ ఉండటాన్ని నిఘా బృందం గమనించింది. పీవీ ఘాట్ వెనుక ప్రాంతంలో పడిపోయిన కాంపౌండ్ వాల్‌ను తిరిగి నిర్మించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సందర్శకులతో రద్దీగా ఉండే ఈ పార్కుల్లో నామమాత్రంగా సెక్యూరిటీ సిబ్బందిని కొనసాగిస్తున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లకు వస్తున్న వాహనాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, పార్కింగ్ లాట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వ ంటి లోపాలను అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని సంబధిత అధికారి ఒకరు తెలిపారు. తనిఖీల్లో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సైఫాబాద్ పోలీసులు, హెచ్ఎండీఏ ఏఓ, రేణుకాశక్తి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
మీడియా ప్రతినిధిపై పార్కింగ్ సిబ్బంది దాడి: కేసు నమోదు
ఖైరతాబాద్: వాహన పార్కింగ్ ప్రాంతంలోకి వస్తే బండి నిలపకున్నా ఫీజు చెల్లించాల్సిందే నంటూ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద పార్కింగ్ సిబ్బంది దందాకు దిగారు. ఇదేమని ప్రశ్నించినందుకు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ దిన పత్రికలో సీనియర్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న బోడపాటి శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇన్సూరెన్స్ చెల్లించాలని ఫోన్ రావడంతో అడ్రస్ వెతుక్కుంటూ బైక్‌పై ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న డాక్టర్ కార్స్ వద్దకు వెళ్లారు. అడ్రస్ అక్కడ కాదని వెనుదిరగ్గానే అక్కడే ఉన్న పార్కింగ్ సిబ్బంది బండి కదలకుండా తాడు అడ్డుపెట్టి పార్కింగ్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను డాక్టర్ కార్స్ వద్దకు వెళ్లానని.. ఎందుకు ఫీజు చెల్లించాలని ప్రశ్నించగా.. ఒకసారి లోపలికి ఎంటర్ అయితే ఫీజు చెల్లించాలంటూ పార్కింగ్‌లో ఉన్న జి.సుభాష్(40), నర్సింగరావుతో పాటు మరో వ్యక్తి కలిసి శ్రీనివాసరావుపై దాడి చేశారు. బండి తాళాలు లాక్కొని దిక్కున్న చోట చెప్పుకోమంటూ దురుసుగా ప్రవర్తించారు. పార్కింగ్ యజమాని ఎవరని, మీకు జీహెచ్ఎంసీ కేటాయించిన పార్కింగ్ స్లాట్ కాపీ చూపించాలని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారంటూ బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.