సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్ వచ్చిందంటే చాలు... ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడతాయి. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. నగరవాసులే కాకుండా సిటీకి వచ్చే పర్యాటకులూ ఈ ప్రాంతాలను చూడకుండా వెళ్లరు. అయితే రెండు నెలలుగా ఈ వినోద కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఆదివారం కేవలం 5వేల మంది సందర్శకులు మాత్రమే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ)కి ఆదాయం తగ్గిపోయింది. దీనికి కారణం ఆయా వినోద కేంద్రాల్లోని ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్‌ల టెండర్లు రద్దు చేయడమే. పిల్లలకు వినోదాన్నిచ్చే ఆయా ప్రాంతాల్లోని బోటింగ్, ట్రైన్, మచాన్ ట్రీ, హంటెడ్ హౌస్, క్యాంటీన్‌లు, టవర్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సిటీజనులు కోరుతున్నారు. లేని పక్షంలో సందర్శకులు తగ్గడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ దృష్టిసారించి తగిన పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆదాయం ఢమాల్...
హుస్సేన్‌సాగర్, దాని చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం 2000 డిసెంబర్ 12న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీని కింద లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, పీవీ జ్ఞాన్ భూమి తదితర ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలను వారానికి లక్ష మంది వరకు సందర్శిస్తుంటారు. వారాంతాల్లో అయితే తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ నుంచి ఆయా ప్రాంతాల్లోని వినోద కేంద్రాలు, క్యాంటీన్స్ బంద్ కావడంతో సందర్శకులు సంఖ్య గణనీయంగా తగ్గింది. జూన్, జూలైలో సందర్శకుల సంఖ్య వారానికి 15వేలు కూడా దాటలేదని ఆ విభాగ సిబ్బందే పేర్కొంటున్నారు. కొంతమంది అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో పార్కుల ఆదాయం భారీగా తగ్గిందని వాపోతున్నారు. ‘జూన్ నుంచి టెండర్లు రద్దు చేయడంతో ప్రతి నెలా అద్దె రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రావట్లేదు. లుంబినీ పార్క్ నుంచి రూ.20 లక్షలు, ఎన్టీఆర్ గార్డెన్‌లో రూ.50 లక్షలు, నెక్లెస్ రోడ్‌లో రూ.10 లక్షలు, పీపుల్స్ ప్లాజాలో రూ.15 లక్షల వరకు వచ్చే ఆదాయం పోతోంది. సాధారణంగా కొత్త టెండర్లు వచ్చే వరకు పాత వాటిని కొనసాగిస్తుంటారు. కానీ బీపీపీఏ అధికారులు మాత్రం టెండర్లను రద్దు చేశారు. ఫలితంగా ఆయా సంస్థల నుంచి వచ్చే అద్దెతో పాటు సందర్శకులు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింద’ని ఓ యజమాని పేర్కొన్నాడు.
రోడ్డున పడిన కూలీలు...
వినోద కేంద్రాలు, ఆట వస్తువుల వెండర్ నిర్వాహకులు 30 మంది వరకు ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు లేకపోవడంతో వెండర్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా వెండర్లలో సుమారు 300 మంది పని చేస్తుంటారు. కార్యకలాపాలు లేకపోవడంతో క్యాంటీన్, టవర్, టాయ్ ట్రెయిన్ తదితర రద్దు చేశారు. దీంతో వాటిల్లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. దినసరి కూలీ లేక ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే అర్ధంతరంగా రద్దు చేసిన టెండర్ల స్థానంలో కొత్త వాటిని ఆహ్వనించినా ఆశించిన ఫలితం ఉండకపోవడంతో ఆయా విభాగాధికారులు తల పట్టుకుంటున్నారు.
పిల్లలను ఆపేదెలా?
మా అన్నయ్య పిల్లలతో కలిసి ఎన్టీఆర్ గార్డెన్‌కు వచ్చాం. అయితే గతంలో వారు వచ్చినప్పుడున్న ట్రైన్, హంటెడ్ హౌస్ లేకపోవడంతో వారిని ఆపలేకపోయాం. అందులోకి వెళ్తామంటూ ఏడ్వడంతో వారిని బుజ్జగించేందుకు చాలా సమయమే పట్టింది. తర్వాత ఐస్‌క్రీమ్ కావాలని మారాం చేయడగా.. అక్కడ క్యాంటీన్‌కు వెళ్లి చూస్తే మూసేసి ఉంది. ఎన్టీఆర్ గార్డెన్‌లో ఏమీ అందుబాటులో లేకపోవడంతో పిల్లలతో వచ్చిన కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. – శ్రీనివాస్, రామచంద్రపురం
Comments
Please login to add a commentAdd a comment