
ఖైరతాబాద్: నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో నిర్మించ తలపెట్టిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ తయారీ పనులను సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శాసన సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న గౌరవమన్నారు. డిసెంబర్ నాటికి విగ్రహ తయారీ పనులు పూర్తవుతాయన్నారు.
నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. అందుకు అనుకూలంగా తెలంగాణ శాసనమండలి తీర్మానం హర్షనీయమన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇదే అంశంపై బీజేపీ పాలిత రాష్ట్రాల వైఖరిని వెల్లడించాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రులు తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు తప్పితే దళితుల ఇంట్లో అన్నం తినలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం తప్ప దళిత వర్గాలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, చిరుమర్తి లింగయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment