సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లు, ఖాళీ స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు ఔత్సాహిక స్థల యజమానుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థలాల లభ్యత కష్టమైన నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ సదుపాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత జూలైలో ప్రకటించిన నూతన పార్కింగ్ విధానంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు ప్రైవేటు స్థల యజమానులకు జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌లు జారీ చేయనుంది.
జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడం ద్వారా ప్రైవేటు స్థల యజమానులు ఆదాయాన్ని పొందనున్నారు. రోడ్లు/మాల్స్/వాణిజ్య సంస్థల సమీపంలోని ఖాళీ స్థలాల్లో పార్కింగ్ స్లాట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఎస్టేట్స్ అండ్ హౌసింగ్) జి.రమేశ్‌కు ప్రభుత్వం వీటి ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. ఆసక్తి ఉన్న యజమానులు సెల్‌నంబర్ 9949546622కు గానీ, acestatehousing @gmail.com మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ప్రతిపాదనలు అందాక పార్కింగ్ స్లాట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలించి 3 నెలలు, లేదా 6 నెలల కాల వ్యవధితో లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన పార్కింగ్ ఫీజులను అమలు చేయడంతో పాటు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో హైదరాబాద్‌లో పార్కింగ్ స్థలాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రైవేటు పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు ప్రారంభించామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
ట్రాఫిక్ బేజారు..
అధికారిక లెక్కల ప్రకారం రోజూ సుమారు 700 కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయి. ఇప్పటికే సరైన పార్కింగ్ సదుపాయాల్లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారుతోంది. మల్టీలెవల్ పార్కింగ్ సదుపా యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. సరైన పార్కింగ్ సదుపాయాల్లేక రోడ్లపై వాహనాలను అస్తవ్యస్తంగా నిలిపేస్తుండటంతో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థలాల లభ్యత లేకపోవడం, స్థలాలు విలువైనవి కావడంతో ప్రభుత్వం ప్రైవేటు పార్కింగ్ స్లాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. అత్యవసరంగా పార్కింగ్ సదుపాయాలను పెంచాల్సిన అవసరముందని, తక్షణమే కనీసం 10 మల్టీ లెవల్ కార్ పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment