
పార్టీ మారి...విజయాన్ని చేరి!
ఎల్‌బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలు మారిన కొందరు జంప్ జిలానీలను అనూహ్యంగా విజయలక్ష్మి వరించింది. హయత్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరి లోకి దిగిన సామ తిరుమల రెడ్డి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌లోకి దూకి...విజయం సాధించారు. చంపాపేట్, వనస్థలిపురం డివి జన్‌ల నుంచి సామ రమణారెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డిలు గత బల్దియా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందారు.
ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా అవే సిట్టింగ్ స్థానాల నుంచి ఎన్నికకావడం విశేషం. గడ్డిఅన్నారం డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన భవాని ప్రవీణ్ కుమార్ చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. వీరందరూ పార్టీలు మారినా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు.