* పార్టీ ఫిరాయింపు సభకు కలెక్టర్ భాగస్వామ్యం..
* కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి చేరిక సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన కలెక్టర్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల్లో ఉన్నతాధికారులను సైతం భాగస్వామ్యం చేస్తున్నారు. దీనికి అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారు. అధికారులు సైతం హద్దులు దాటి స్వామిభక్తి ప్రదర్శించుకుంటున్నారు. ఇందుకు సజీవ సాక్ష్యం కర్నూలు జిల్లాలో శనివారం ఆవిష్కృతమైంది. ఏదో గ్రామస్థాయి.. మండలస్థాయి.. జిల్లాస్థాయి అధికారి కాదు.. ఏకంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగి ఫిరాయింపు సభకు ఏర్పాట్లు చేయడం రాజకీయ వర్గాల్ని నివ్వెరపరిచింది.
వైఎస్సార్‌సీపీ తరఫున కర్నూలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఈ చేరిక సందర్భంగా కర్నూలులో శనివారం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సభ ఏర్పాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ దగ్గరుండి పర్యవేక్షించారు.
జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ పార్టీ ఫిరాయింపు సభకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు సభకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ వెళ్లారంటే అర్థం ఉంది.. కానీ పార్టీఫిరాయింపు సభ ఏర్పాట్లనే ప్రత్యేకంగా పర్యవేక్షించడం పట్ల ఐఏఎస్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ జిల్లా కలెక్టర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఎస్వీ: వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీఎం చంద్రబాబునాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరీ ఇంత బరితెగింపా?
Published Sun, May 8 2016 12:29 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement