నిమ్స్‌లో బిల్డింగ్ ఎక్కి రోగి హంగామా
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రోగి శనివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో హంగామా చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని, అలాగే అమెరికాలో ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భవనం పై నుంచి కిందకు దూకుతాని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అతడిని ఎట్టకేలకు కిందకు దించారు.
వివరాల్లోకి వెళితే... కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రదీప్(20) అనే యువకుడు ముఖంపై మచ్చలకు చికిత్స నిమిత్తం 2007 సంవత్సరం నుంచి నిమ్స్ వైద్యశాలకు వస్తున్నాడు. అయితే ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అవకాశం లేదని, పైగా భారత దేశంలో కూడా ఈ చికిత్స లేదని, అమెరికా వెళ్లాలని వైద్యులు చెబుతూ వస్తున్నారు.
అయితే ఇన్నేళ్లుగా వైద్యులు తనను పట్టించుకోవడంలేదని, ఆరోగ్యశ్రీతో అయినా లేక అమెరికా పంపి అందుకు అయ్యే వైద్య ఖర్చులకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం నిమ్స్ భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ దయాకర్ ద్వారా వైద్యులు ఒక లేఖను రూపొందించి భవనంపైకి పంపి అతనిద్వారా రోగికి దాన్ని అందజేశారు. దీంతో అతన్ని ఎలాగో కిందకు తీసుకురాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి 9.55 వరకు భవనంపైనే నిలబడి హల్‌చల్ చేశాడు.