హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావం నాటి నుంచి పార్టీనే అంటిపెట్టుకుని కష్ట నష్టాల్లో పనిచేసిన ప్రతీ ఉద్యమకారుడిని, కార్యకర్తను గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అవకాశాలు కల్పిస్తున్నారని పలువురు మంత్రులు పేర్కొన్నారు. వరంగల్‌కు చెందిన పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలోని డి బ్లాకు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని, సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవి లభించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.
పార్టీని నమ్ముకుని, విశ్వాసంతో కలిసి నడిచిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవిని అప్పగించి సీఎం కేసీఆర్ మరో సారి రుజువు చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. పౌరసరఫరాల శాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నామని, రైతాంగానికి మరిన్ని సేవలు అందివ్వడానికి కృషి చేస్తున్నట్లు ఆర్ధిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గొప్ప మార్పు తేవాలని, సీఎం కేసీఆర్ ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దాలని ఈటల సూచించారు. ఉద్యమంలో అంకితభావంతో పనిచేసిన వారిని పేరు పేరునా గుర్తుపెట్టుకుని సీఎం కేసీఆర్ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పదిహేనేళ్లు ఏ అంకింత భావంతో పార్టీకోసం పనిచేశారో, అదే నిబద్దతతో పనిచేయాలని ఆయన సుదర్శన్ రెడ్డికి సూచించారు. ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని గౌరవించుకోవడం ఆనందం కలిగిస్తోందని, మొదటి నుంచీ పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కష్టకాలంలోనూ పార్టీని విడవకుండా పనిచేసిన వారికి ఆదరణ లభిస్తుందని, సముచిత స్థానం దక్కుతుందని పెద్ది సుదర్శన్రెడ్డికి దక్కిన అవకాశమే తేటతెల్లం చేస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అభిప్రాయ పడ్డారు. పెద్ది సుదర్శన్ బాధ్యతల స్వీకరణలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, సీతారాం నాయక్, సివిల్ సప్లైస్ కమిషనర్, సీవీ ఆనంద్, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు...తగిన గుర్తింపు
Published Sat, Oct 22 2016 6:26 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement