peddi sudharshan reddy
-
పేదింటి బిడ్డను.. ఆశీర్వదించండి..
సాక్షి, దుగ్గొండి(నర్సంపేట): ‘కడుపేద కుటుంబంలో పుట్టాను.. తెలంగాణ కోసం ఉద్యమించాను.. ఎందరో ఆదరించారు. అన్నం పెట్టారు. మీ ఇంటిబిడ్డగా కడుపులో పెట్టి చూసుకున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.. పెద్ద మనసుతో నాకు ఓటు వేసి ఆశీర్వదించాలి’ అని నర్సంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. మండలంలోని తొగర్రాయి, శివాజీ నగర్, బిక్కాజిపల్లి, రేకంపల్లి, చలపర్తి, జీడికల్, నారాయణతండా, తిమ్మంపేట, మహ్మదాపురం గ్రామాలలో పెద్ది మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు , బతుకమ్మలతో స్వాగతం పలికారు. నుదట తిలకం దిద్ది గెలుపు నీదే అంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పెద్ది ప్రసంగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచానని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించానని గుర్తు చేశారు. కష్ట కాలంలో పార్టీని రక్షించే బాధ్యత తీసుకున్నానని వెల్లడించారు. పేదలు కూలి పోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివాసముంటున్నారని, వారందరికి తాను గెలిచిన అనంతరం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో పట్టుబట్టి ఎస్సారెస్పీ జలాలు తీసుకొచ్చి వందలాది చెరువులు నింపి వేలాది ఎకరాల పంటకు సాగునీరందించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నూకల నరేష్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, జెడ్పీటీసీ సుకినె రజితరాజేశ్వర్‌రావు, ఎంపీపీ కుక్కముడి సుశీలా కమలాకర్, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తోకల నర్సింహారెడ్డి, నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ పొన్నం మొగిళి, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, మేర్గు రాంబాబు, కాట్ల భద్రయ్య, రాణాప్రతాప్‌రెడ్డి, సాంబలక్ష్మి, జనార్దన్‌రెడ్డి, లింగయ్య, లింగంపల్లి రవీందర్, ముదరకోల కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, కుమారస్వామి, తిరుపతి, కోటి, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
'గులాబీ'లా ప్రచారాలు
సాక్షి, వరంగల్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. ఈ గులీబీ నేతలు వింత వింత ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఒకరు చాయ్ వాలా వేషం వేస్తే ఇంకొకరు రైతన్నగా దర్శనం ఇచ్చారు. ఇలా కొంతమంది టీఆర్ఎస్ నాయకుల వింత ప్రచార వేషాలు. చాయ్‌వాలా.. నర్మెట: కన్నెబోయిన గూడెంలో టీలు అందిస్తున్న టీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓట్ల ‘గని’ మీదే.. భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలోని కేటికే 1వ గని కార్మికులను ఓటు వేయాలని కోరుతున్న టీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి మధుసూదనాచారి బతుకులు మార్చేస్తా... రాయపర్తి: ఆరెగూడెంలో ప్రచారంలో భాగంగా కుమ్మరిసారె తిప్పుతూ కుండలు చేస్తున్న టీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి దయాకర్‌రావు రైతన్నగా పెద్ది నల్లబెల్లి: లెంకాలపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో నాగలి దున్నతున్న టీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి -
నా ఇంటి అల్లుణ్ని గెలిపించుకోవాలి : కడియం
సాక్షి, నర్సంపేట : పెద్ది సుదర్శన్ రెడ్డి అభివృద్ధికి మారుపేరని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే నర్సంపేట అభివృద్ధే ధ్యేయంగా సుదర్శన్ నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు భూమి పట్టాలు ఇప్పించిన ఘనత సుదర్శన్‌కు దక్కుతుందన్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు.ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ రచించిన ఆర్టికల్ అనుగుణంగానే కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రాబోయే రోజుల్లో తయారు చేయబోతున్నాము. నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి ఏరోజు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. నా ఇంటి బిడ్డను చేసుకున్న నా ఇంటి అల్లుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని అన్నారు. -
ఉద్యమకారులకు...తగిన గుర్తింపు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావం నాటి నుంచి పార్టీనే అంటిపెట్టుకుని కష్ట నష్టాల్లో పనిచేసిన ప్రతీ ఉద్యమకారుడిని, కార్యకర్తను గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అవకాశాలు కల్పిస్తున్నారని పలువురు మంత్రులు పేర్కొన్నారు. వరంగల్‌కు చెందిన పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలోని డి బ్లాకు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని, సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవి లభించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పార్టీని నమ్ముకుని, విశ్వాసంతో కలిసి నడిచిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవిని అప్పగించి సీఎం కేసీఆర్ మరో సారి రుజువు చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. పౌరసరఫరాల శాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నామని, రైతాంగానికి మరిన్ని సేవలు అందివ్వడానికి కృషి చేస్తున్నట్లు ఆర్ధిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గొప్ప మార్పు తేవాలని, సీఎం కేసీఆర్ ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దాలని ఈటల సూచించారు. ఉద్యమంలో అంకితభావంతో పనిచేసిన వారిని పేరు పేరునా గుర్తుపెట్టుకుని సీఎం కేసీఆర్ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పదిహేనేళ్లు ఏ అంకింత భావంతో పార్టీకోసం పనిచేశారో, అదే నిబద్దతతో పనిచేయాలని ఆయన సుదర్శన్ రెడ్డికి సూచించారు. ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని గౌరవించుకోవడం ఆనందం కలిగిస్తోందని, మొదటి నుంచీ పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కష్టకాలంలోనూ పార్టీని విడవకుండా పనిచేసిన వారికి ఆదరణ లభిస్తుందని, సముచిత స్థానం దక్కుతుందని పెద్ది సుదర్శన్‌రెడ్డికి దక్కిన అవకాశమే తేటతెల్లం చేస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అభిప్రాయ పడ్డారు. పెద్ది సుదర్శన్ బాధ్యతల స్వీకరణలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, సీతారాం నాయక్, సివిల్ సప్లైస్ కమిషనర్, సీవీ ఆనంద్, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.