నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పాల్ రాజ్
సాక్షి: ‘మేల్ ఎస్కార్ట్స్ (మగ వ్యభిచారులు) కావాలని అందమైన ప్రకనటలు ఇచ్చి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రూ.25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ పాలరాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్‌కు చెందిన జి.తుకారాం (29), మొగల్‌పురాకు చెందిన ఎం.శరణప్ప (27), కార్వాన్‌కు చెందిన హెచ్.రాజు (28) ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు.
మేల్ ఎస్కార్ట్స్ కావాలని, నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు జీతం ఉంటుందని..ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలని వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇచ్చారు. వీటిన చూసి తమను సంప్రదించిన నిరుద్యోగులందరినీ ఒక చోటకు రప్పించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరాలనుకుంటున్న వారు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు డిపాజిట్ చేయాలని చెప్పి ఆరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అభ్యర్థులు వారు సూచించిన అకౌంట్స్‌లో డబ్బు వేయగానే నిందితులు ఆ డబ్బును ఏటీఎం నుంచి డ్రా చేసి జాల్సా చేస్తున్నారు. ఇలా వేలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వీరు దండుకున్నారు.
ఈ తరహా మోసాలను ఇటీవల సీసీఎస్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్’ అధికారులు పసిగట్టారు. దర్యాప్తులో వీరు చేసిన మోసాలు వెలుగు చూశాయి. దీంతో పై ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన రూ.2.45 లక్షల నగదు, కారు, రెండు బైక్‌లు, లాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్‌లు, తుకారాం, శరణప్పలకు చెందిన రెండు ఇళ్లను సీజ్ చేశారు. మోసాలకుపాల్పడి వచ్చిన డబ్బుతోనే వీరు ఈ ఇళ్లను ఖరీదు చేసినట్లు పోలీసుల విచారణలోతేలింది. ఈ ముఠా రెండేళ్ల నుంచి తన కార్యకలాపాలను సాగించింది. విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ ఏసీపీ డాక్టర్ బి.అనురాధ, ఇన్‌స్పెక్టర్ మాజీద్ అలీ ఖాన్‌లు పాల్గొన్నారు.