male escort
-
మేల్ ఎస్కార్ట్స్ పేరుతో మోసం
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వ్యాపారికి మేల్ ఎస్కార్ట్‌గా అవకాశం కల్పిస్తామంటూ ఫోన్ చేసిన నేరగాళ్లు అతడి నుంచి డబ్బు వసూలు చేశారు. ఓ దశలో పోలీసులకు సమాచారం ఇస్తామంటూ చెప్పి బెదిరించారు. మొత్తమ్మీద రూ.3 లక్షలకుపైగా సైబర్ క్రిమినల్స్‌కు ‘సమర్పించుకున్న’ బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ మండల పరిధిలోని కార్వాన్కు చెందిన వ్యాపారికి శనివారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆయనతో మాట్లాడిన గుర్తుతెలియని మహిళ ‘ఆల్ ఇండియా ఎస్కార్ట్స్ సర్వీసెస్’ నుంచి మాట్లాడుతున్నామని, ఓ ఆఫర్ మీకు ఇస్తున్నామని చెప్పింది. తమ వద్ద కేవలం రూ.1070 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని, ఆపై మేల్ ఎస్కార్ట్స్‌గా అవకాశ కల్పిస్తూ నెలకు రూ. 30 వేల వరకు సంపాదించుకునేందుకు సహకరిస్తామని ఎర వేసింది. దీనికి ఆకర్షితుడైన సదరు వ్యాపారి ఆ యువతి సూచించినట్లే డబ్బును ఓ ఖాతాలోకి బదిలీ చేశారు. మర్నాడు మరోసారి ఫోన్ చేసిన మహిళ మేల్ ఎస్టార్ట్గా మా సంస్థ నుంచి గుర్తింపు కార్డు తయారు చేసి అందించాల్సి ఉందని చెప్పింది. దాని కోసం మరో రూ.18,700 చేయాలని చెప్పింది. ఈ మొత్తం చెల్లింపు విషయంలో వ్యాపారి ఆలోచనలో పడగా.. ఈ డబ్బులో కేవలం రూ.700 మాత్రమే చార్జిగా తీసుకుంటామని, మిగిలింది రిఫండబుల్ అంటూ మహిళ చెప్పింది. దీంతో వారి వల్లో పడిన వ్యాపారి ఆ మొత్తాన్నీ వారు సూచించిన విధంగా డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అందుకున్న సైబర్ నేరగాళ్ళు ఆధార్‌కార్డు సహా మరికొన్ని పంపాల్సిందిగా కోరి వాట్సాప్ చేయించుకున్నారు. ఆపై కొత్త నాటకానికి తెరలేపారు. మళ్లీ వ్యాపారికి కాల్ చేసిన మహిళ ఫోన్లో మీరు చెప్పిన దాని ప్రకారం వయసు 38 ఏళ్లు కాగా.. ఆధార్ కార్డు ప్రకారం 39గా ఉందని పేర్కొంది. ఈ కారణంగానే ఆన్లైన్లో గుర్తింపు కార్డు తయారు కావట్లేదని నమ్మబలికింది. దీంతో అడ్వాన్డ్స్ ఐడీ కార్డు తయారు చేయడానికి మరో రూ.18,700 డిపాజిట్ చేయాలని.. వీటిలో రూ.18 వేలు తిరిగి చెల్లిస్తామని ఎర వేసింది. ఇది నమ్మిన వ్యాపారి మరో రూ.18,700 జమ చేశాడు. మరోసారి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తమ సంస్థతో లీగల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉందని వ్యాపారికి చెప్పారు. దీనికోసం అంటూ రూ.43,500 డిపాజిట్ చేయించారు. చివరగా మేల్ ఎస్కార్ట్ పోస్టుకు పోలీస్ వెరిఫికేషన్ చేయించాల్సి ఉందని, దానికోసం రూ. 75 వేలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఈ మొత్తం డిపాజిట్ చేయడానికి వ్యాపారి వెనుకాడటంతో... మేము కోరినట్లు డబ్బు చెల్లించకపోతే మీ స్థానిక పోలీసుస్టేషన్‌కు ఈ సమాచారం ఇస్తామంటూ బెదిరించారు. మొత్తమ్మీద వివిధ పేర్లు చెప్పిన సైబర్ నేరగాళ్ళు వ్యాపారి నుంచి రూ.3,06,970 వసూలు చేశారు. అంతటితో ఆగన ఆ నేరగాళ్ళు మరికొంత గుంజాలని ప్రయత్నాలు చేశారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ దర్యాప్తు ప్రారంభించారు. -
మేల్ ఎస్కార్ట్స్ సేవల పేరుతో మోసం!
-
మేల్ ఎస్కార్ట్స్ అంటూ కి'లేడీ' కుచ్చుటోపీ
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కి'లేడీ'ని పోలీసులు అరెస్ట్ చేశారు. 'మగ వ్యభిచారులుగా (మేల్ ఎస్కార్ట్స్)గా ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. మంచి జీతం, కమీషన్ ఇస్తాం..ఇంకెందుకు ఆలస్యం... మమ్మల్ని సంప్రదించండి'.... అంటూ పాతబస్తీకి చెందిన ఫర్హీన్ నాజ్ సిమ్రాన్ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ పేరుతో వెబ్సైట్ ప్రారంభించింది. ఇంటర్నెట్, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రకటనలిచ్చి వందమందికిపైగా యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది. రిజిస్ట్రేషన్ కోసం 5వేల నుంచి 7వేల వరకు వసూలు చేసింది. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే మూడున్నర లక్షల వరకు వసూలు చేసింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ క్లబ్ మాటున ఫర్హీన్ నాజ్ మోసం చేస్తున్నట్లు బయటపడింది. ఆమె దగ్గర నుంచి ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ మేల్ ఎస్కార్ట్స్ పేరిట మోసానికి పాల్పడిన కర్నూలు జిల్లాకు చెందిన కనకబోయిన వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
‘మేల్ ఎస్కార్ట్స్’ పేరిట మోసం..
హైదరాబాద : ‘‘మగ వ్యభిచారులుగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా.. వెంటనే తమ సంస్థలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బ్యాంకులో డబ్బులు జమ చేయండి. అనంతరం నెలకు ఎంత జీతం అనే విషయాలు వెల్లడిస్తాం’’ అని ఏదైనా సంస్థ మీకు ఈ మెయిల్, ఎస్ఎంఎస్ చేసిందో వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మగ వ్యభిచారుల (మేల్ ఎస్కార్ట్స్) ఉద్యోగాల పేరుతో పలు సంస్థలు నిరుద్యోగులను నిట్టనిలువునా దోచుకుంటున్నాయి. ఇలాంటి ఓ సంస్థ మోసాన్ని నగర సీసీఎస్ పోలీసులు ఛేదించి నిందితుడ్ని అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ సి.రవివర్మ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన కనకబోయిన వరప్రసాద్ (20) కూకట్‌పల్లిలో స్థిరపడ్డాడు. మగ వ్యభిచారులు కావాలని, ఈమెయిల్స్ ప్రకటనలు జారీ చేశాడు. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు యువకులు అతడి సెల్‌ఫోన్‌ను సంప్రదించారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకునేందుకు తన బ్యాంకు అకౌంట్లో రూ.5000 నుంచి రూ.7000 వరకు జమ చేయాలని సూచించాడు. నెల జీతంలో 20 శాతం డబ్బును సంస్థకు చెల్లించాలని షరతు విధించాడు. ఇందుకు అంగీకరించిన పలువురు నిరుద్యోగులు అతడి అకౌంట్లో డబ్బులు వేశారు. తీరా అతను చెప్పిన తేదీన ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్‌క్రైమ్ ఏసీపీ బి.అనురాధను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ జి.శంకర్రాజు కేసు దర్యాప్తు చేసి నిందితుడి శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగుల నుంచి ఎనిమిది నెలల్లో సుమారు రూ.2 లక్షల వరకు దండుకున్నాడని విచారణలో తేలింది. -
‘మేల్ ఎస్కార్ట్స్’ పేరిట దగా
సాక్షి: ‘మేల్ ఎస్కార్ట్స్ (మగ వ్యభిచారులు) కావాలని అందమైన ప్రకనటలు ఇచ్చి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రూ.25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ పాలరాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్‌కు చెందిన జి.తుకారాం (29), మొగల్పురాకు చెందిన ఎం.శరణప్ప (27), కార్వాన్కు చెందిన హెచ్.రాజు (28) ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. మేల్ ఎస్కార్ట్స్ కావాలని, నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు జీతం ఉంటుందని..ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలని వెబ్సైట్లో ప్రకటనలు ఇచ్చారు. వీటిన చూసి తమను సంప్రదించిన నిరుద్యోగులందరినీ ఒక చోటకు రప్పించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరాలనుకుంటున్న వారు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు డిపాజిట్ చేయాలని చెప్పి ఆరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అభ్యర్థులు వారు సూచించిన అకౌంట్స్‌లో డబ్బు వేయగానే నిందితులు ఆ డబ్బును ఏటీఎం నుంచి డ్రా చేసి జాల్సా చేస్తున్నారు. ఇలా వేలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వీరు దండుకున్నారు. ఈ తరహా మోసాలను ఇటీవల సీసీఎస్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్’ అధికారులు పసిగట్టారు. దర్యాప్తులో వీరు చేసిన మోసాలు వెలుగు చూశాయి. దీంతో పై ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన రూ.2.45 లక్షల నగదు, కారు, రెండు బైక్‌లు, లాప్టాప్, రెండు సెల్ఫోన్లు, తుకారాం, శరణప్పలకు చెందిన రెండు ఇళ్లను సీజ్ చేశారు. మోసాలకుపాల్పడి వచ్చిన డబ్బుతోనే వీరు ఈ ఇళ్లను ఖరీదు చేసినట్లు పోలీసుల విచారణలోతేలింది. ఈ ముఠా రెండేళ్ల నుంచి తన కార్యకలాపాలను సాగించింది. విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ ఏసీపీ డాక్టర్ బి.అనురాధ, ఇన్స్పెక్టర్ మాజీద్ అలీ ఖాన్లు పాల్గొన్నారు.