మేల్ ఎస్కార్ట్స్ అంటూ కి'లేడీ' కుచ్చుటోపీ
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కి'లేడీ'ని పోలీసులు అరెస్ట్ చేశారు. 'మగ వ్యభిచారులుగా (మేల్ ఎస్కార్ట్స్)గా ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. మంచి జీతం, కమీషన్ ఇస్తాం..ఇంకెందుకు ఆలస్యం... మమ్మల్ని సంప్రదించండి'.... అంటూ పాతబస్తీకి చెందిన ఫర్హీన్ నాజ్ సిమ్రాన్ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇంటర్నెట్, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రకటనలిచ్చి వందమందికిపైగా యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది.
రిజిస్ట్రేషన్ కోసం 5వేల నుంచి 7వేల వరకు వసూలు చేసింది. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే మూడున్నర లక్షల వరకు వసూలు చేసింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ క్లబ్ మాటున ఫర్హీన్ నాజ్ మోసం చేస్తున్నట్లు బయటపడింది. ఆమె దగ్గర నుంచి ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ మేల్ ఎస్కార్ట్స్ పేరిట మోసానికి పాల్పడిన కర్నూలు జిల్లాకు చెందిన కనకబోయిన వరప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.