‘మేల్ ఎస్కార్ట్స్’ పేరిట మోసం..
హైదరాబాద : ‘‘మగ వ్యభిచారులుగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా.. వెంటనే తమ సంస్థలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బ్యాంకులో డబ్బులు జమ చేయండి. అనంతరం నెలకు ఎంత జీతం అనే విషయాలు వెల్లడిస్తాం’’ అని ఏదైనా సంస్థ మీకు ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్ చేసిందో వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మగ వ్యభిచారుల (మేల్ ఎస్కార్ట్స్) ఉద్యోగాల పేరుతో పలు సంస్థలు నిరుద్యోగులను నిట్టనిలువునా దోచుకుంటున్నాయి.
ఇలాంటి ఓ సంస్థ మోసాన్ని నగర సీసీఎస్ పోలీసులు ఛేదించి నిందితుడ్ని అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ సి.రవివర్మ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన కనకబోయిన వరప్రసాద్ (20) కూకట్‌పల్లిలో స్థిరపడ్డాడు. మగ వ్యభిచారులు కావాలని, ఈమెయిల్స్ ప్రకటనలు జారీ చేశాడు. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు యువకులు అతడి సెల్‌ఫోన్‌ను సంప్రదించారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకునేందుకు తన బ్యాంకు అకౌంట్‌లో రూ.5000 నుంచి రూ.7000 వరకు జమ చేయాలని సూచించాడు. నెల జీతంలో 20 శాతం డబ్బును సంస్థకు చెల్లించాలని షరతు విధించాడు.
ఇందుకు అంగీకరించిన పలువురు నిరుద్యోగులు అతడి అకౌంట్‌లో డబ్బులు వేశారు. తీరా అతను చెప్పిన తేదీన ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్‌క్రైమ్ ఏసీపీ బి.అనురాధను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ జి.శంకర్‌రాజు కేసు దర్యాప్తు చేసి నిందితుడి శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అతడి నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగుల నుంచి ఎనిమిది నెలల్లో సుమారు రూ.2 లక్షల వరకు దండుకున్నాడని విచారణలో తేలింది.