![చార్జీల పెంపునకు ప్రజలు సానుకూలం](/styles/webp/s3/article_images/2017/09/4/41467065898_625x300.jpg.webp?itok=8YGx_g0X)
చార్జీల పెంపునకు ప్రజలు సానుకూలం
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
- ప్రతిపక్షాలవి పసలేని విమర్శలు
- పల్లెవెలుగుతో రూ.500 కోట్ల నష్టాలు.. అయినా సర్వీసులు పెంచుతాం
- కొత్తగా వేయికి పైగా గ్రామాలకు బస్సు వసతి కల్పిస్తాం
- నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం
సాక్షి, హైదరాబాద్: గతంలో ప్రభుత్వాలు ఆర్టీసీని నిర్లక్ష్యం చేయటం, సంస్థలో అంతర్గత సామర్థ్యం కొరవడటం వల్లనే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. పరిస్థితికి తగ్గట్టుగా టికెట్ల ధరలు పెంచకపోవటంతో క్రమంగా నష్టాలు మరింతగా పెరిగిపోయాయన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందున దాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు అధికారులు, కార్మికులతో సమష్టిగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. కేవలం టికెట్ల రూపంలో వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు.
ఇటీవల 10 శాతం మేర పెంచిన చార్జీలపై ప్రయాణికులు సానుకూలంగా స్పందించారని, రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలన్న లక్ష్యంతో విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలవి పసలేని విమర్శలన్నారు. సోమవారం ఆయన బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పల్లె వెలుగు బస్సుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల నష్టాలు వచ్చాయని, అయినా వాటిని విస్తరిస్తామే తప్ప సర్వీసుల ఉపసంహరణ ఉండదన్నారు. ఇప్పటికీ వేయికిపైగా గ్రామాలకు బస్సు వసతి లేదని, వాటికి కూడా బస్సులు నడిపే యోచనలో ఉన్నట్టు సత్యనారాయణ వివరించారు.
కొత్తగా 1,200 బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం చేయూత ఇవ్వనున్నందున చిన్నచిన్న బస్సులను కూడా కొనుగోలు చేస్తామన్నారు. ప్రైవేటు వేడుకలకు ప్రజలు ఆర్టీసీ బస్సులనే బుక్ చేసేలా వీటిని వినియోగిస్తామని, ప్రధాన బస్‌స్టేషన్ భవనాలను మినీ థియేటర్‌లాంటి వాటికి లీజుకివ్వటం ద్వారా ఆదాయం పెంచుకోబోతున్నామన్నారు. ఇటీవల నామమాత్రంగా 10 శాతం మేర పెంచిన చార్జీల వల్ల కేవలం మూడింట ఒకటోవంతు నష్టాలనే సర్దుబాటు చేయగలమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే చార్జీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు.
సర్పంచులు, స్థానిక నేతల సహకారం
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాల నుంచి ప్రయాణికులను ఆర్టీసీవైపు మళ్లించేందుకు వీలుగా ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నేతల సహకారం తీసుకుంటున్నామని సోమారపు సత్యనారాయణ చెప్పారు. డిపో మేనేజర్లు వారితో భేటీ అయి ప్రజల్లో అవగాహన తెచ్చేలా కృషి చేస్తారన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడాల్సిన పొదుపు నిధి, భవిష్య నిధి నుంచి కూడా డబ్బులు వాడుకుని ఇప్పటివరకు వాటిని చెల్లించలేకపోయామని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినందున అవి రాగానే వాటిని తీర్చేస్తామన్నారు.
పొరుగు రాష్ట్రాలకు నడిచే బస్సుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. ఇప్పటికే ఏపీకి 80 కొత్త సర్వీసులు ప్రార ంభించామన్నారు. నగరంలో సిగ్నల్ జంపింగ్‌కు పాల్పడే డ్రైవర్లే చలానాలు భరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన బస్టాండ్లను ఆధునీకరిస్తున్నామని, ఇందుకు అభివృద్ధి నిధులు కోరుతూ ఎమ్మెల్యేలకు లేఖలు రాశామని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. ఇటీవల కరీంనగర్ బస్టాండు అభివృద్ధికి మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు.