
గుండె గు‘బిల్లు’
గాజులరామారం: బిల్లు చూడగానే వారి గుండె గుబేలుమంది. రెండు గదులు ఉన్న మధ్య తరగతి కుటుంబానికి కరెంట్ బిల్లు ఏకంగా రూ.5 లక్షలకు పైగా రావడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే కారు డ్రైవర్‌గా పని చేస్తున్న గంగిరెడ్డి కుటుంబంతో కలిసి గాజులరామారం డివిజన్ శ్రీరాంనగర్‌లో ఇంటి నంబరు 5-25-602/1లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం విద్యుత్ సిబ్బంది వచ్చి కరెంట్ మీటర్ సర్వీస్ నంబరు 0908-01218కు రీడింగ్ తీసుకుని డిమాండ్ నోటీసును (బిల్లు) గంగిరెడ్డి భార్య హేమలతకు ఇవ్వడంతో బిల్లు చూసుకున్న ఆమె బిల్లు రూ .5,06,499 రావడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
రెండు గదుల్లో 2 లైట్‌లు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, 1 ఫ్యాన్ మాత్రమే వాడుతున్నామని, అలాంటప్పుడు ఇంత బిల్లు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి నెల రూ.300 బిల్లు వస్తున్నట్లు తెలిపారు. దీనిపై గాజులరామారం ఏఈ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా మీటర్ రీడింగ్ మిషన్ సమస్య ఉంటుందని, వెంటనే పరిశీలించి బిల్లు సరి చేస్తామని తెలిపారు.