టీవీనో ఫ్రిజ్జో.. కరెంటు బిల్లు కడుతుంది! | Automated payments with smart devices | Sakshi
Sakshi News home page

టీవీనో ఫ్రిజ్జో.. కరెంటు బిల్లు కడుతుంది!

Aug 20 2025 5:00 AM | Updated on Aug 20 2025 5:00 AM

Automated payments with smart devices

స్మార్ట్‌ డివైజెస్‌తో ఆటోమేటెడ్‌ పేమెంట్స్‌

ఇంటి అద్దె, ఓటీటీ చందా సహా అన్నీ 

రెడీ అవుతున్న యూపీఐ నూతన వెర్షన్

మీ ఇంట్లోని ఫ్రిజ్‌.. మీ ఇంటి కరెంటు బిల్లు కట్టేస్తే! 
మీ వాషింగ్‌ మెషీన్‌ మీ ఇంటి అద్దె చెల్లించేస్తే!!
మీ స్మార్ట్‌ వాచ్, మీ స్మార్ట్‌ టీవీ.. 
మీ ఫోన్‌ బిల్లు లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 
రెన్యువల్‌ చేయడం వంటివి చేసేస్తే!!!
నమ్మబుద్ధి కావడం లేదు కదూ... కానీ, త్వరలో సాధ్యం కానున్నాయి. 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) యూపీఐ అప్‌డేటెడ్‌ వర్షన్ ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్  ఆఫ్‌ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే స్మార్ట్‌ ఉపకరణాలే ఆటోమేటెడ్‌ పేమెంట్స్‌ను పూర్తి చేసేస్తాయి. అంటే యూపీఐ చెల్లింపులకు స్మార్ట్‌ఫోన్ పై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐ ఆటోపే, యూపీఐ సర్కిల్‌ మాదిరిగా కొత్త ఫీచర్‌ పనిచేస్తుందన్న మాట.  - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలన్నా.. ఇంటి అద్దె కట్టాలన్నా పర్సు తీసేవాళ్లు.  ఇప్పుడు ఫోన్  తీస్తున్నారు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) రాక చెల్లింపుల తీరునే మార్చింది. ఇప్పుడు ఇది మరో  సంచలనానికి సిద్ధమైంది. స్మార్ట్‌ గాడ్జెట్స్‌తో చెల్లింపులు జరిపే కొత్త యూపీఐ వ్యవస్థను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేస్తోంది. అంటే ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయిన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, కార్లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి పరికరాల ద్వారా మన ప్రమేయం లేకుండా యూపీఐ ఆటోమేటెడ్‌ పేమెంట్స్‌ చేయవచ్చు. 

ఈ వ్యవస్థ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ్స వంటి చెల్లింపులను స్మార్ట్‌ పరికరాల నుండి నేరుగా ఆటో పేమెంట్‌ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. అంటే పార్కింగ్‌ ఫీజును కనెక్టెడ్‌ కారు నుండి నేరుగా చెల్లించవచ్చు. ఇంట్లోని స్మార్ట్‌ టీవీ ద్వారా ఓటీటీల చందాను, నెలవారీ అద్దె, విద్యుత్‌ బిల్లులు కట్టేయొచ్చు. ఇవన్నీ థర్డ్‌ పార్టీ యూపీఐ యాప్‌ను తెరవకుండానే జరిగిపోతాయన్నమాట.

అక్టోబరులోగా..
ఎన్ పీసీఐ ఈ ఐఓటీ–రెడీ యూపీఐని అక్టోబర్‌ 7–9 తేదీల్లో ముంబైలో జరిగే గ్లోబల్‌ ఫిన్ టెక్‌ ఫెస్ట్‌ 2025 వేదికగా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే నియంత్రణ సంబంధ అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే వినియోగదారుల యూజర్‌ ఎక్స్‌పీరియెన్ ్స మరింత మెరుగుపడుతుంది. ఈ కొత్త వ్యవస్థ కోసం నియంత్రణ సంబంధ, డేటా భద్రతపై కూడా ఎన్ పీసీఐ పనిచేస్తోంది. అనధికార లావాదేవీల కట్టడితోపాటు గోప్యతకు పెద్దపీట వేసే దిశగా అడుగులేస్తోంది. 

» 2024–25లో యూపీఐ వేదికగా 18,587 కోట్ల లావాదేవీలకుగాను రూ.261 లక్షల కోట్లు చేతులు మారాయి.
» దేశవ్యాప్తంగా జూలైలో రికార్డు స్థాయిలో రూ.25 లక్షల కోట్ల విలువ చేసే 1,946.79 కోట్ల లావాదేవీలు జరిగాయి. 
» యూపీఐ చరిత్రలో అత్యధికంగా జూలై 1న రూ.1.10 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి.

ఆదేశిస్తే చాలు..
» వినియోగదారుడు ప్రాథమిక యూపీఐ ఐడీకి ప్రత్యేక వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ అనుసంధానం అవుతుంది. తద్వారా చెల్లింపులను ఆటోమేటిగ్గా పూర్తి చేయడానికి ఉపకరణాలకు వీలవుతుంది. 
» ప్రధాన యూపీఐ డివైస్‌ అయిన మొబైల్‌ ఫోన్  నుంచి సంబంధిత స్మార్ట్‌ ఉపకరణానికి ఆటోమేటిగ్గా చెల్లింపులు జరిపేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
» నిర్దేశిత పరిమితులతో సెకండరీ యూజర్లు చెల్లింపులను జరిపేలా వీలు కల్పించే యూపీఐ సర్కిల్‌ మాదిరిగా స్మార్ట్‌ పరికరాలు సైతం నిర్దేశించిన మొత్తాన్ని సురక్షితంగా పేమెంట్స్‌ పూర్తి చేస్తాయి. 
» యూజర్ల ప్రధాన అకౌంట్‌కు అనుసంధానమై సెకండరీ యూపీఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. 
» ఎన్ని ఉపకరణాలు జోడిస్తే అన్ని ఐడీలు ఉంటాయి. ఈ ఫీచర్‌ కోసం వన్‌–టైమ్‌ పాస్‌వర్డ్‌ తప్పనిసరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement