
పెర్త్ క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఆస్ట్రేలియూ వెళ్లేందుకు ప్రియదర్శిని
తల్లిదండ్రులకు తత్కాల్ పాస్‌పోర్టు
వరంగల్ క్రైం: ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అక్కడ గాయపడిన ప్రియదర్శిని తల్లిదండ్రులు గురువారం వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. తమ కూతురు అల్లుడిని చూడడానికి ఆస్ట్రేలియూ వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం విన్నవించారు. వారికి తత్కాల్ పాస్‌పోర్ట్ అందేలా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఏర్పాట్లు చేశారు. పాస్‌పోర్ట్ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని తన మిత్రులకు కమిషనర్ ఫొన్‌చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు. ఆస్ట్రేలియా దేశంలోని పెర్త్ నగరంలో 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌కుమార్ సామల, భీమవరానికి చెందిన శేషగిరి మేడవరపు అనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. వారితోపాటు అదే కారులో ప్రయాణిస్తున్న హన్మకొండకు చెందిన బానియార్ కమలాకర్, కవిత దంపతుల కుమార్తె - అల్లుడు ప్రియదర్శిని, నిశాంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిద్దరూ ప్రస్తుతం పెర్త్‌లోని రాయల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, తమ కుమార్తె, అల్లుడిని చూడడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కావాల్సిన పాస్‌పోర్ట్ కమలాకర్, కవిత దంపతులకు లేకపోవడంతో వారు గురువారం పోలీస్ కమిషనర్‌ను కలిసి జరిగిన సంఘటన చెప్పారు. స్పందించిన పోలీస్ కమిషనర్ వారికి తత్కాల్ పాస్‌పోర్ట్ లభించేలా చర్యలు చేపట్టారు. వీరికి పాస్‌పోర్ట్ కార్యాలయంలో సహకారం అందించేందుకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. అలాగే, క్షతగాత్రులకు అవసరమైన చికిత్స చేసేం దుకు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి క్షతగాత్రుల వివరాలను తెలియపరిచారు. వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలను అందజేయూల్సిందిగా పెర్త్, మెల్‌బోర్న్‌లోని తన మిత్రులకు, డాక్టర్లకు ఫోన్‌చేసి కోరారు. గాయపడిన నిశాంత్, ప్రియదర్శినిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిందని, కారును ఆస్ట్రేలియూకు చెందిన యువతి నడుపుతున్నదని, ఆమె కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిసిందని ప్రియదర్శిని తండ్రి కమలాకర్, తల్లి కవిత తెలిపారు.