
ప్రణాళికలు పక్కకు !
విభజన ఎఫెక్ట్
=కొత్త ఫ్లైఓవర్లకు మంగళం
=అటకెక్కిన అభివృద్ధి ప్రాజెక్టులు
=ఆచి తూచి అడుగులేస్తున్న హెచ్‌ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో : ‘మహా’ నగర రూపురేఖల్ని పూర్తిగా మార్చేయాలనుకొన్న హెచ్‌ఎండీఏ పక్కా ప్రణాళిక ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్ర విభజన వ్యవహారం తేలేవరకు అభివృద్ధి పథకాల ఊసే ఎత్తవద్దని ఉన్నతాధికారులు అంతర్గతంగా నిర్ణయించుకొన్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి సిద్ధం చేసిన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఎల్)లను సైతం ప్రభుత్వానికి పంపకుండా అధికారులు పక్కకు పెట్టేశారు.
రాజకీయ అనిశ్చితి వల్ల కొత్త ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో హెచ్‌ఎండీఏలో ఇంజనీరింగ్ విభాగానికి చేతినిండా పనిలేకుండా పోయింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నగరం (కోర్ ఏరియా)లోని 10 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీ చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టులను చేపట్టేందుకు సాహసించలేకపోతోంది.
ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే 10 ఏళ్లపాటు కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కోర్ ఏరియా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన పది ఫ్లైఓవర్ల నిర్మాణానికి నీలి నీడలు కమ్ముకోవడం ఖాయంగా కన్పిస్తోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టులకు సొంతం గా నిధులు వెచ్చించే ఆర్థిక బలం హెచ్‌ఎండీఏకు లేదు. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాజెక్టులకు మంగళం పాడటమే ఉత్తమంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
మెట్రో రైల్ బూచిగా...
మెట్రో రైల్ వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు దాదాపు పరిష్కారమవుతాయని అధికారులు దాన్ని బూచిగా చూపుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి అంతా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, అమీర్‌పేట, బేగంపేట ప్రాంతాలకే పరిమితమైంది. అందుకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఫ్లైఓవర్లు, రోడ్ బ్రిడ్జిల నిర్మాణాలు జరగడంతో అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యల వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది.
దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ఫ్లైఓవర్లు, రోడ్ బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టాలని హెచ్‌ఎండీఏ గతంలో కోర్ ఏరియా మాస్టర్ ప్లాన్‌లో సూచించింది. నగరంలోని 29 ప్రాంతాల్లో ట్రాఫిక్ సమ్యను అధిగమించేందుకు లింకురోడ్ల నిర్మాణం తప్పని సరి అని తేల్చింది. అలాగే 70 ప్రధాన రహదారులను వాణిజ్య రహదారులుగా గుర్తించాలని, మొత్తం 10 ఫ్లైఓవర్లతో పాటు 13 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి బృహత్ ప్రణాళిక ప్రతిపాదించింది. అలాగే హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 9 మీటర్ల మేర పూర్తిగా గ్రీనరీ ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఇతర నిర్మాణాలకు ఆస్కారంలేకుండా చూడాలని సూచించింది. ఆ ప్రతిపాదనలకు రూపకల్పన జరుగుతున్న సమయంలో విభజన సెగ తాకడంతో అధికారులు ఎక్కడి ప్రణాళికలను అక్కడే అటకెక్కించారు.
కొత్త వంతెనలు ఇక్కడే...
కోర్ ఏరియా మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా 22 ప్రాంతాలను మల్టీ పర్పస్ జోన్ (బహుళ ప్రయోజనాల)గా గుర్తించారు. ఇందులో ఐఎస్ సదన్, ఇంజన్‌బౌలి, బహదూర్‌పురా, దేవీభాగ్, గౌలిగూడ బస్టాప్, చాంద్రాయణగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కాచీగూడ రైల్వే స్టేషన్ ప్రాంతం, మిథాని, ఫలక్‌నుమా బస్‌డిపో ప్రాంతం, మెహిదీపట్నం, గడ్డిఅన్నారం, టోలీచౌకీ, పంజాగుట్ట, అమీర్‌పేట, కేబీఆర్‌పార్కు, ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయ ప్రాంతం, బొగ్గులకుంట, గౌలిగూడ, నాంపల్లి ప్రాంతాలున్నాయి.
ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య నియంత్రణకు 10 ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో చిన్నచిన్న లింక్ రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులతో కలపాలని ప్రణాళికలు రూపొందిం చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ఈ కొత్త ఫ్లైఓవర్ల ప్రణాళికకు పాతర వేసింది. ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులేవీ ప్రారంభించే యోచనేలేదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.