బాబు దుబారా.. నిధులకు కత్తెర | Pm modi shock chandrababu | Sakshi
Sakshi News home page

బాబు దుబారా.. నిధులకు కత్తెర

Published Thu, Apr 7 2016 12:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

బాబు దుబారా.. నిధులకు కత్తెర - Sakshi

బాబు దుబారా.. నిధులకు కత్తెర

రాష్ట్రం కొంపముంచిన  విచ్చలవిడి వ్యయాలు
♦ నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా ఏపీ లోటు భర్తీకి రూ.1,000 కోట్లు చాలన్న ప్రధాని మోదీ!
♦ అందులో రూ.500 కోట్లే విడుదల... మిగతా నిధులు లెక్కలు చెప్పాకే
♦ మొత్తంగా లోటు భర్తీకి రూ.3,303 కోట్లతోనే సరి!
♦ అంతా రాష్ట్ర సర్కారు స్వయంకృతాపరాధమే అంటున్న అధికార యంత్రాంగం
 
 సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్రానికి రెవెన్యూలోటు భర్తీ కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను భారీగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిధుల్ని పొదుపుగా వినియోగించడానికి బదులు రాష్ట్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా వినియోగించడం, దుబారా చేయడం.. అదే సమయంలో రాయితీలు, సబ్సిడీల పేరుతో విచ్చలవిడిగా చేసిన వ్యయాలు కొంపముంచాయి. ముఖ్యంగా 2014-15 ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్రప్రభుత్వం దుబారా ఖర్చులు, రాయితీల పేరుతో చేసిన వ్యయాలపై కేంద్రప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

రాష్ట్రానికి రెవెన్యూలోటు భర్తీకోసం కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై ఇది ప్రభావం చూపింది. 2014-15 ఆర్థికసంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించారు. దాన్ని పరిశీలించిన ప్రధాని రెవెన్యూలోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.1,000 కోట్లను విడుదల చేస్తే సరిపోతుందని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక తొలుత రూ.500 కోట్లను విడుదల చేయాలని, కేంద్రం అడిగిన వ్యయాలకు సంబంధించిన లెక్కలు రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చాకనే మిగతా సొమ్మును విడుదల చేయాలని కూడా పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రెవెన్యూలోటు భర్తీ కింద రూ.500 కోట్లను మాత్రమే విడుదల చేసింది. దీంతో కేంద్రం కోరిన మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరం చివర్లో చేసిన ఖర్చుల వివరాలతోపాటు రాయితీలు, సబ్సిడీల కింద చేసిన వ్యయాల వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ రెండు రోజులక్రితం పంపింది. వాటిని పరిశీలించి సంతృప్తి చెందాకనే మిగతా రూ.500 కోట్లను కేంద్రం విడుదల చేస్తుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

 స్వయంకృతాపరాధమే : రాష్ట్ర విభజన చట్టంలో తొలి ఏడాది(2014-15)లో ఏర్పడే రెవెన్యూలోటును కేంద్రం భర్తీ చేస్తుందని పేర్కొనడం తెలిసిందే. అందుకనుగుణంగా తొలుత రాష్ట్రప్రభుత్వం రూ.15,690 కోట్ల రెవెన్యూలోటు ఏర్పడినట్లు కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. అకౌంటెంట్ జనరల్ ప్రాథమిక నివేదిక వచ్చాక రెవెన్యూ లోటు భర్తీపై తేల్చుతామని తెలిపింది. పూర్తిస్థాయిలో నివేదికొచ్చాక స్పందిస్తామని ఆ తర్వాత పేర్కొంది. ఈలోగా రెవెన్యూలోటు భర్తీ కింద రూ.2,303 కోట్లను విడుదల చేసింది. ఇప్పుడు కేవలం మరో రూ.వెయ్యికోట్లతో సరిపెడుతోంది.

నీతిఆయోగ్ నివేదికలో ఏం పేర్కొన్నారో తెలియదు కానీ.. ఆ నివేదిక చూశాకనే ప్రధానమంత్రి రూ.1,000 కోట్లు విడుదల చేస్తే చాలని చెప్పారని, దీన్నిబట్టిచూస్తే మొత్తం రెవెన్యూలోటు భర్తీని రూ.3,303 కోట్లతో సరిపెడుతున్నట్లు అర్థమవుతోందని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా రెవెన్యూలోటును భారీగా చూపించడానికే 2014-15 ఆర్థిక సంవత్సరం చివర్లో రాయితీలు, సబ్సిడీల పేరుతోను భారీగా వ్యయం చేశారని కేంద్రం ఆక్షేపిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిధుల్ని పొదుపుగా వాడడానికి బదులు అనవసర రంగాలకు భారీగా వెచ్చించారనేది కేంద్ర వాదనగా ఉందని అవి పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ యుగంలో ఏదీ దాచలేమని, ఏ రాష్ట్రం ఎప్పుడు ఏ రంగానికి నిధులు వ్యయం చేసిందనే వివరాలు కేంద్రానికి తెలిసిపోతాయని, అందుకు విరుద్ధంగా ఏ లెక్కలు చెప్పినా కేంద్రాన్ని తప్పుదోవపట్టించిన వారమవుతామని, అంతేగాక రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇది స్వయంకృతాపరాధంతప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement