
అమెరికా వ్యవసాయ విధానాలు స్ఫూర్తిదాయకం
వ్యవసాయ మంత్రి పోచారం అమెరికా వ్యవసాయశాఖ అధికారులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వ వ్యవసాయ విధానాలు అభివృద్ధి చెందుతోన్న దేశాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి ప్రతినిధి బృందం శనివారం వాషింగ్టన్ డీసీలో అమెరికా వ్యవసాయశాఖ, విత్తన సంస్థ (యూఎస్ గ్రెయిన్ కౌన్సిల్) అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో మంత్రితోపాటు ఎంపీ వినోద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ ఎ.మురళి, మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ రైతుల ఉత్పత్తులకు మార్కెట్లో తక్కువ ధర పలికితే నష్టపోతున్న మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రతీ ఐదేళ్లకు వ్యవసాయరంగంలో మార్పుల కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారని తెలిపారు.
వ్యవసాయశాఖ ద్వారా స్థానిక పాఠశాలల్లో అమెరికా ప్రభుత్వం పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అనంతరం మంత్రి బృందం అమెరికా విత్తన సంస్థ (స్వచ్ఛంద సంస్థ) కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేం దుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని సంస్థ అధికారులు మంత్రి బృందానికి హామీయిచ్చారు. ఈ భేటీలో అమెరికా వ్యవసాయశాఖ ప్రతినిధి జేసన్ హాఫెమెయిస్టర్, అమెరికా విత్తన సంస్థ అధ్యక్షులు థామస్ యెన్ స్లేయిట్ తదితరులు పాల్గొన్నారు.