బీహార్ లో తుపాకీ కొని..
హైదరాబాద్: కేబీఎస్ బ్యాంకు సీఈవోపై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత ఆదివారం మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని శ్రీ దుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో నివసించే కేబీఎస్ బ్యాంకు సీఈవో మన్మథ్ దాలియా ఇంటికి బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితులైన నలుగురిలో షేక్ అబ్దుల్ రహీం, నరేష్, రాజేందర్ లను పట్టుకున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. నాలుగో నిందితుడు వెంకటరత్నం ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులందరూ రాజమండ్రికి చెందనివారేనని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు తుపాకీ కొనుగోలు చేసేందుకు బీహార్ వెళ్లినట్లు తెలిపారు.
తుపాకీ కొనుగోలు తర్వాత ప్లాన్ ప్రకారం.. దాలియాపై దాడి చేసి డబ్బు దోచుకునేందుకు ఆయన ఇంటి వద్దకు వెళ్లి కాల్పులు జరిపినట్లు చెప్పారు. ప్లాన్ విఫలం అవడంతో అక్కడి నుంచి పరారయ్యారని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మొత్తం పది ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులో రెండు రోజుల్లోనే పురోగతి సాధించినట్లు తెలిపారు.