‘పోలీసు భవనానికి’ కమిటీ
* సీసీ టీవీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటుకూ కార్యవర్గం
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు నూతనంగా నిర్మించనున్న నగర పోలీసు కమిషనర్ హెడ్‌క్వార్టర్, సీసీకెమెరాల ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దేందుకు అత్యాధునిక హంగులతో 24 అంతస్థుల పోలీసు హెడ్ క్వార్టర్‌ను బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే.
ఈ భవన నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటుకు కూడా మరో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిషనరేట్ భవనంలో పది జిల్లాలతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే లక్ష సీసీకెమెరాల నిర్వాహణను ఈ రూమ్‌తో అనుసంధానం చేస్తారు.
ఈ భవనంలో వీడియో వాల్, వైర్‌లెస్ సిస్టం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, కంట్రోల్ సెన్సార్స్, నెట్‌వర్క్ డివెజైస్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల వీడియో అండ్ ఆడియో కాన్ఫరెన్స్ సెంటర్, జీయోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ (జీఐఎస్), ఏరియల్ సర్వేతో పాటు అత్యవసర సేవలైన డయల్ 100, అగ్నిమాపక అంబులెన్స్, క్రైమ్ హాట్‌స్పాట్ అనలైసిస్, కమాండో టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, సిటీలో ఉన్న ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పాటు అదనంగా అత్యవసర సమయాల్లో రెవెన్యూ, జీహెచ్ ఎంసీ, రోడ్డు భవనాల శాఖ, ఆరోగ్యం, రవాణా శాఖలకు తోడ్పాటు అందించే విధంగా నిర్మిస్తారు.
ఉన్నతస్థాయి కమిటీ
పోలీసు క్వార్టర్స్ ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్శ, సభ్యులుగా డీజీపీ అనురాగ్‌శర్మ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, హోం శాఖల ప్రిన్సిపల్స్, ఫైనాన్స్ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డెరైక్టర్, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, ఎం.మహేందర్‌రెడ్డి ఉంటారు.
వీరు ఈ కమిటీ మెగా ప్రాజెక్ట్ కోసం తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చడం,టెండర్ల నిర్వహణకు ముందు ప్లాన్ అప్రూవల్ చేయడం, పీఎంయూ - టెక్నికల్ కమిటీ ప్రతిపాదించిన పనులను పర్యవేక్షించడం, ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష, పాలసీ నిర్దేశాలు, నాణ్యతాప్రమాణాలు, ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడానికి సానుకూల వాతావరణం కల్పించడంపై దృష్టిసారిస్తారు -రాజీవ్‌శర్శ
‘సీసీటీవీ సిస్టం’ కమిటీ
సీసీటీవీ సర్వే లెన్స్ సిస్టం ఉన్నత స్థాయి కమిటీకిచైర్మన్‌గా సిటీ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సభ్యులుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పైన పేర్కొన్న విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు.
- మహేందర్‌రెడ్డి