బెల్లంకొండ సురేష్, మంచు లక్ష్మీ
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, నటి మంచు లక్ష్మీప్రసన్నలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. డబ్బు లావాదేవీలకు సంబంధించి ఇరువురూ ఒకరిపై ఒకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. బెల్లంకొండ సురేష్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంచు లక్ష్మిపై కేసు నమోదు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 'రభస' సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి నిర్మించిన 'ఊ కొడతారా...ఉలిక్కి పడతారా' సినిమా సెట్ను రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. దీనికి 58 లక్షల రూపాయలు ఇస్తానని సురేష్ మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ డబ్బు ఇవ్వకపోవడంతో . తమకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి ఈ చిత్రం విడుదల చేసుకోమని మంచు లక్ష్మి గట్టిగా పట్టుబట్టారు. అంతే కాకుండా బెల్లంకొండ సురేష్ ఇంటివద్ద మంచు లక్ష్మికి చెందిన కొందరు వ్యక్తులు తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాలని ధర్నా చేశారు.. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ వివరణ ఇస్తూ గతంలో తన బ్యానర్లో మంచు విష్ణుతో ఓ సినిమా నిర్మించేందుకు కొంత డబ్బు అడ్వన్స్ ఇచ్చానని తెలిపారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమా నిర్మించలేకపోయినట్లు చెప్పారు. అందువల్ల ఆ మొత్తంలో తను ఇవ్వల్సిన మొత్తంని మినహాయించుకోమని చెప్పినట్లు తెలిపారు.
అయితే విష్ణుకు ఇచ్చిన డబ్బుకు దీనికి లింక్ పెట్టవద్దని మంచు లక్ష్మి చెప్పారు. తన డబ్బు తనకు ఇవ్వమని కోరారు. చిలికి చిలికి చివరకు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునేవరకు ఈ సమస్య వచ్చింది.