పెళ్లి రద్దు.. అమ్మాయి కిడ్నాప్ | Police chase ends in attempted kidnap of woman | Sakshi
Sakshi News home page

పెళ్లి రద్దు.. అమ్మాయి కిడ్నాప్

Published Sat, Jan 24 2015 2:14 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

పెళ్లి రద్దు.. అమ్మాయి కిడ్నాప్

పెళ్లి రద్దు.. అమ్మాయి కిడ్నాప్

*యువతి అపహరణకు దుండగుల యత్నం
*సకాలంలో స్పందించిన పోలీసులు
*వాహనాల్లో వెంబడించి పట్టుకున్న వైనం
* సుమారు రెండు గంటల పాటు హైడ్రామా

 
హైదరాబాద్ : కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ. శుక్రవారం ఉదయం ఓ యువతి (19) ఇంట్లో టైలరింగ్ చేస్తోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. ఆమెను బలవంతంగా ఇండికా కారులో ఎక్కించుకొని బయలుదేరారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన యువతి 'కాపాడండి' అంటూ కేకలు వేసింది. ఈ కేకలు విని స్థానికంగా ఉన్న రవీందర్, ప్రవీణ్, శ్రీను ద్విచక్ర వాహనాలతో కారును వెంబడించారు. కొంపల్లి సినీ ప్లానెట్ వరకు వీరు కారును అనుసరించారు. కారు దూలపల్లి మీదుగా మళ్లింది.
 
ఇంతలో మల్లారెడ్డి కాలేజీ వద్ద పేట్‌ బషీరాబాద్ పెట్రోల్ మొబైల్-2 టీమ్ పోలీసులు ఎదురవడంతో యువకులు వారికి విషయాన్ని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సీఐ అల్లం సుభాష్‌చంద్ర బోస్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించారు. కారు వెళ్లే దారిలోని పోలీసు స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జిన్నారం వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి... కారును ఆపే ప్రయత్నం చేశారు. దుండగులు దాన్ని వాహనంతో ఢీ కొట్టి వెళ్లిపోయారు.
 
నర్సాపూర్ సీఐ రాంరెడ్డి అనేక చోట్ల రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయించినా ఫలితం కనిపించలేదు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు వినోద్ నర్సాపూర్ సమీపంలో యువతిని తీసుకుని కారు నుంచి దిగిపోయాడు. షేరింగ్ ఆటోలో వెళ్లి పోలీసుల దృష్టి మరల్చాడు. ఇలా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. కారులోని నిందితులకు తోడుగా స్కార్పియో (ఏపీ 27 బి 9900) వాహనంలో వెళుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.
 
వారి ద్వారా నిందితుల సమాచారాన్ని సేకరిస్తూ.. ముందుకు సాగారు. ఈ క్రమంలో సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరువు చేరుకున్న నిందితులు యువతిని వదిలి పరారయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం రెండు గంటలకు యువతిని తీసుకొని పోలీసులు తిరుగుముఖం పట్టారు. దీంతో కథ సుఖాంతమైంది. యువతి తల్లి విద్యావతి బోరున విలపిస్తూ కుమార్తెను హత్తుకుంది. అంతవరకూ ఉత్కంఠతో గడిపిన యువతి తల్లిదండ్రులు... బంధువులు... స్థానికులు...ఊపిరి పీల్చుకున్నారు.
 
 అసలేమైందంటే...
 ఈ సంఘటన కు కారణాలపై పేట్‌బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ అల్లం సుభాష్‌ చంద్రబోస్‌ల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ కంగిటి మండలం తుర్కపాడ్గవ్ గ్రామానికి చెందిన అడిక రమేష్, విద్యావతి దంపతులు కొంపల్లి సమీపంలోని ఉమా మహేశ్వర కాలనీలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె (19)కు బీదర్ సమీపంలో ఉన్న మార్చాపూర్ గ్రామానికి చెందిన దూరపు బంధువు వినోద్(27)తో పెళ్లి చేయాలని ఏడాది క్రితం నిశ్చయించారు. ఇంతలో తాగుడుకు అలవాటు పడిన వినోద్ వ్యవహర శైలి యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు.
 
 దీపావళి పండుగ రోజు యువతి తల్లిదండ్రులు వినోద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 'పెళ్లి సంబంధం వద్దు.. వేరే అబ్బాయితో తమ కుమార్తె వివాహం చేస్తామ' ని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు రమేష్, విద్యావతి పనులకు... వారి కుమారుడు కళాశాలకు వెళ్లిపోయాడు. యువతి మాత్రమే ఇంట్లో ఉంది. దీన్ని గుర్తించిన దుండగులు పథకం ప్రకారం ఆమెను అపహరించేందుకు యత్నించారు.
 
 తాగుబోతు అని వద్దనుకున్నాం..
'స్వయానా ఆడబిడ్డ కోడలి తమ్ముడే వినోద్. ఏడాది క్రితం పెళ్లి కోసం మాట్లాడుకున్నాం. తాగుబోతు అని తెలిసి వద్దనుకున్నాం. ఇంతకు తెగిస్తాడని అనుకోలేదు. మళ్లీ వాళ్లు ఏమైనా చేస్తారేమోనని భయమేస్తో'దంటూ యువతితల్లి విద్యావతి ఏసీపీ అశోక్‌కుమార్ వద్ద వాపోయింది.
 
 కొనసాగుతున్న గాలింపు
మొత్తం రెండు కార్లలో వచ్చిన వారిలో నలుగురు పోలీసులకు చిక్కగా.... ప్రధాన నిందితుడు వినోద్‌తో పాటు మరో ముగ్గురు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నట్లు సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సకాలంలో స్పందించిన ఎస్‌ఐలు అశోక్, కోటేశ్వరరావుతో పాటు మొబైల్ టీమ్ సిబ్బందిని ఏసీపీ అశోక్‌కుమార్ అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement