attempt to kidnap
-
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ యత్నం కేసు
నెల్లూరు (క్రైమ్): తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డికి శుక్రవారం ఫోన్ చేసి వైఎస్సార్సీపీని వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్ రెడ్డి నిరాకరించడంతో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్యతో కలిసి కార్పొరేటర్ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయపాలెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తెలిపారు. -
ఈర్లదిన్నెలో విద్యార్థి కిడ్నాప్ కలకలం
కర్నూలు ,గూడూరు రూరల్: సి.బెళగల్ మండలంలో విద్యార్థుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసి దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా బాలుడు తప్పించుకుని తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈర్లదిన్నెకు చెందిన ఆనంద్ ముడుమాల హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ముడుమాలలోని స్నేహితుడి వద్ద పుస్తకం తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి ఆనంద్ బయలుదేరాడు. మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెన్నయ్య బావి వద్దకు వెళ్లి రోడ్డుపైకి వచ్చిన ఆనంద్‌కు ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మత్తు మందు గుడ్డను ముఖానికి అదిమిపెట్టగా స్పృహ కోల్పొయాడు. ఆనంద్‌ను బైక్‌పై ఇద్దరి మధ్యన వేసుకుని ముడుమాల నుంచి పోలకల్ మీదుగా వెలుతుండగా మార్గమధ్యలో బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడ్డారు.స్పృహలోకి వచ్చిన ఆనంద్ దుండగుల నుంచి తప్పించుకుని పంట పొలాల మీదుగా పరుగులు తీస్తూ గ్రామానికి చేరుకున్నాడు. కిడ్నాప్ విషయాన్ని తండ్రి నాగరాజుకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుకార్లను నమ్మొద్దు పోలకల్, ముడుమాల గ్రామాలకు చెందిన విద్యార్థులు కిడ్నాప్‌నకు గురైనట్లు వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి సూచించారు. రెండు రోజుల నుంచి విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అయితే సీసీ కెమెరాల్లో గాని, విద్యార్థులు, తల్లిదండ్రులను విచారించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మండలంలో ఎలాంటి కిడ్నాప్‌లు జరగలేదని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని, ఎవరైనా తప్పుడు పుకార్లను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో నిత్యం పోలీసు సిబ్బంది పర్యటిస్తుందని సీఐ తెలిపారు. -
పెళ్లి రద్దు.. అమ్మాయి కిడ్నాప్
*యువతి అపహరణకు దుండగుల యత్నం *సకాలంలో స్పందించిన పోలీసులు *వాహనాల్లో వెంబడించి పట్టుకున్న వైనం * సుమారు రెండు గంటల పాటు హైడ్రామా హైదరాబాద్ : కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ. శుక్రవారం ఉదయం ఓ యువతి (19) ఇంట్లో టైలరింగ్ చేస్తోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. ఆమెను బలవంతంగా ఇండికా కారులో ఎక్కించుకొని బయలుదేరారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన యువతి 'కాపాడండి' అంటూ కేకలు వేసింది. ఈ కేకలు విని స్థానికంగా ఉన్న రవీందర్, ప్రవీణ్, శ్రీను ద్విచక్ర వాహనాలతో కారును వెంబడించారు. కొంపల్లి సినీ ప్లానెట్ వరకు వీరు కారును అనుసరించారు. కారు దూలపల్లి మీదుగా మళ్లింది. ఇంతలో మల్లారెడ్డి కాలేజీ వద్ద పేట్ బషీరాబాద్ పెట్రోల్ మొబైల్-2 టీమ్ పోలీసులు ఎదురవడంతో యువకులు వారికి విషయాన్ని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సీఐ అల్లం సుభాష్‌చంద్ర బోస్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించారు. కారు వెళ్లే దారిలోని పోలీసు స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జిన్నారం వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి... కారును ఆపే ప్రయత్నం చేశారు. దుండగులు దాన్ని వాహనంతో ఢీ కొట్టి వెళ్లిపోయారు. నర్సాపూర్ సీఐ రాంరెడ్డి అనేక చోట్ల రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయించినా ఫలితం కనిపించలేదు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు వినోద్ నర్సాపూర్ సమీపంలో యువతిని తీసుకుని కారు నుంచి దిగిపోయాడు. షేరింగ్ ఆటోలో వెళ్లి పోలీసుల దృష్టి మరల్చాడు. ఇలా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. కారులోని నిందితులకు తోడుగా స్కార్పియో (ఏపీ 27 బి 9900) వాహనంలో వెళుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి ద్వారా నిందితుల సమాచారాన్ని సేకరిస్తూ.. ముందుకు సాగారు. ఈ క్రమంలో సంగారెడ్డి మీదుగా పటాన్చెరువు చేరుకున్న నిందితులు యువతిని వదిలి పరారయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం రెండు గంటలకు యువతిని తీసుకొని పోలీసులు తిరుగుముఖం పట్టారు. దీంతో కథ సుఖాంతమైంది. యువతి తల్లి విద్యావతి బోరున విలపిస్తూ కుమార్తెను హత్తుకుంది. అంతవరకూ ఉత్కంఠతో గడిపిన యువతి తల్లిదండ్రులు... బంధువులు... స్థానికులు...ఊపిరి పీల్చుకున్నారు. అసలేమైందంటే... ఈ సంఘటన కు కారణాలపై పేట్‌బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్‌ల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ కంగిటి మండలం తుర్కపాడ్గవ్ గ్రామానికి చెందిన అడిక రమేష్, విద్యావతి దంపతులు కొంపల్లి సమీపంలోని ఉమా మహేశ్వర కాలనీలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె (19)కు బీదర్ సమీపంలో ఉన్న మార్చాపూర్ గ్రామానికి చెందిన దూరపు బంధువు వినోద్(27)తో పెళ్లి చేయాలని ఏడాది క్రితం నిశ్చయించారు. ఇంతలో తాగుడుకు అలవాటు పడిన వినోద్ వ్యవహర శైలి యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీపావళి పండుగ రోజు యువతి తల్లిదండ్రులు వినోద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 'పెళ్లి సంబంధం వద్దు.. వేరే అబ్బాయితో తమ కుమార్తె వివాహం చేస్తామ' ని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు రమేష్, విద్యావతి పనులకు... వారి కుమారుడు కళాశాలకు వెళ్లిపోయాడు. యువతి మాత్రమే ఇంట్లో ఉంది. దీన్ని గుర్తించిన దుండగులు పథకం ప్రకారం ఆమెను అపహరించేందుకు యత్నించారు. తాగుబోతు అని వద్దనుకున్నాం.. 'స్వయానా ఆడబిడ్డ కోడలి తమ్ముడే వినోద్. ఏడాది క్రితం పెళ్లి కోసం మాట్లాడుకున్నాం. తాగుబోతు అని తెలిసి వద్దనుకున్నాం. ఇంతకు తెగిస్తాడని అనుకోలేదు. మళ్లీ వాళ్లు ఏమైనా చేస్తారేమోనని భయమేస్తో'దంటూ యువతితల్లి విద్యావతి ఏసీపీ అశోక్‌కుమార్ వద్ద వాపోయింది. కొనసాగుతున్న గాలింపు మొత్తం రెండు కార్లలో వచ్చిన వారిలో నలుగురు పోలీసులకు చిక్కగా.... ప్రధాన నిందితుడు వినోద్‌తో పాటు మరో ముగ్గురు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నట్లు సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సకాలంలో స్పందించిన ఎస్ఐలు అశోక్, కోటేశ్వరరావుతో పాటు మొబైల్ టీమ్ సిబ్బందిని ఏసీపీ అశోక్‌కుమార్ అభినందించారు. -
విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం
దర్మవరం: కళాశాలకు వెళ్తున్న అమ్మాయిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసేందుకు యత్నం చేశారు. ఈ సంఘటన శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం శ్రీసాయి మహిళ డిగ్రీ కళాశాల సమీపంలో జరిగింది. అదే కళాశాలలో డ్రిగ్రీ చదువుతున్న స్రవంతి అనే విద్యార్థిని కాలేజీ ముందు ఉన్న బుక్‌స్టోర్‌కు వెళ్లింది. అదే సమయంలో మంకీ క్యాపులు (ముసుగులు) వేసుకున్న నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా సుమోలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. వారి దాడితో అప్రమత్తమైన యువతి వెంటనే కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఏఏస్పీ ఆఫీసుకు కూతవేటుదూరంలో జరగడం గమనార్హం. -
దౌత్యవేత్తపై కిడ్నాప్ యత్నం
యెమన్ రాజధాని సనా నగరంలో కిడ్నాప్ యత్నం నుంచి బయటపడిన ఓ జర్మన్ దౌత్యవేత్త తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని సాయుధులు ఆయనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిచంఇనట్లు యెమన్ హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. హడ్డా ప్రాంతంలో ఉన్న జర్మనీ రాయబార కార్యాలయం సమీపంలో దౌత్యవేత్త వెళ్తున్న కారును తమ కారుతో అడ్డగించేందుకు సాయుధులు ప్రయత్నించారు. అయితే కారు ఆపేందుకు దౌత్యవేత్తతో పాటు డ్రైవర్ కూడా నిరాకరించి, వేగంగా వాహనాన్ని పోనించారు. వెంటనే సాయుధులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరపగా, దౌత్యవేత్త స్వల్పంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. సాయుధులు వెంటనే అక్కడినుంచి పారిపోయారు. దౌత్యవేత్త కాలికి గాయం అయినట్లు రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.