పోలీసులు, మీడియా చానెల్ ప్రతినిధులమంటూ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు ఓ సినీ నటుడిని కిడ్నాప్ చేశారు.
రూ.2 లక్షలు డిమాండ్ పోలీసులను ఆశ్రయించిన ఓ సినీ నటుడు
బంజారాహిల్స్: పోలీసులు, మీడియా చానెల్ ప్రతినిధులమంటూ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు ఓ సినీ నటుడిని కిడ్నాప్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే కాలెపు శ్రీనివాసరావు(48) సినిమాలలో నటిస్తుంటాడు. గతనెల 31న ఉదయం 10.30కి ఐదుగురు యువకులు, ఇద్దరు యువతులు తాము పోలీసులమని, ఓ న్యూస్ చానెల్ ప్రతినిధులమంటూ ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. ‘‘వ్యభిచార గృహం నడిపిస్తున్నావు.. నీపై చాలా కేసులున్నాయి’’ అని బెదిరించారు.
ఆయన వద్ద ఉన్న రూ.10,800 నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఆయనను కొట్టి, కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. ఏటీఎం కార్డు ద్వారా రూ.2500 డ్రా చేశారు. కారులో ఆయనను నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. ‘‘రూ.2 లక్షలు ఇస్తే బతుకుతావు, లేదంటే ఎన్‌కౌంటర్ చేస్తాం’’ అని బెదిరించారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు దుండగులంతా చింతల్‌లోని ఓ ఇంట్లోకి వెళ్లగా.. వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు తప్పించుకున్నారు.
వారి భయానికి మూడు రోజుల పాటు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న ఆయన శనివారం రాత్రి తనను కిడ్నాప్ చేయడమే కాకుండా చంపుతామని బెదిరించారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చిన వారిలో జలీల్, జగదీష్, రాజు, మధు, సంజయ్‌రెడ్డి, లక్ష్మి, దుర్గ తదితరులు ఉన్నారని, వీరందరినీ తాను గుర్తుపడతానని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 448,323, 384, 363, 506 కింద కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు.