రాష్ట్రవ్యాప్తంగా ‘పోలీసు ల్యాబ్స్’ ఏర్పాటు
సీసీఎస్ ప్రారంభోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. నేరగాళ్లకు చెక్ పెట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ క్రైమ్, సైబర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.7.3 కోట్లతో ఆధునీకరించిన హైదరాబాద్ సెంట్ర ల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) భవనంతోపాటు రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ ల్యాబ్స్‌లో ఉన్న సదుపాయాలు, కొంత పరిజ్ఞానం కేవలం హైదరాబాద్ పోలీసుకు మాత్రమే సొంతమని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అవి అందుబాటులో లేవన్నారు. సీసీఎస్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి, డీసీపీ అవినాశ్ మహంతిలను డీజీపీ అభినందించారు. సీసీ ఎస్ ఆధీనంలో ఏర్పాటైన క్రైమ్, సైబర్ ల్యాబ్స్‌ను పరిశీలించిన ఆయన ఈ తరహాలో నే అన్ని జిల్లాలు, సీఐడీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. భారీ కేసుల్ని సీసీఎస్‌లోని ల్యాబ్స్ సహకారంతోనే దర్యాప్తు చేయిస్తామని డీజీపీ వివరించారు. జిల్లాల వారీగా ల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం అందరు ఎస్పీలతో సమావేశం నిర్వ హించనున్నట్లు పేర్కొన్నారు. సీఐడీతో పాటు జిల్లాల వారీగా అవసరమైన నిధులపై అంచనాలు రూపొందిస్తామని, ఈ బడ్జెట్‌లోనే ప్రభుత్వం నుంచి వాటిని పొందేలా కృషి చేస్తామన్నారు.