పోలీసు పదోన్నతుల జగడం! | Police promotion battle! | Sakshi
Sakshi News home page

పోలీసు పదోన్నతుల జగడం!

Published Fri, May 26 2017 1:22 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీసు పదోన్నతుల జగడం! - Sakshi

పోలీసు పదోన్నతుల జగడం!

- సరైన ప్రణాళిక లేకుండా పదోన్నతులకు తెరలేపిన పోలీస్‌ శాఖ
రోజుకో జాబితా తయారీ.. లీక్‌.. గందరగోళం
సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదులు.. ఆపై జాబితాలో మార్పులు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో పదోన్నతుల గందరగోళం ఏర్పడింది. సీని యారిటీ పాటించడం లేదంటూ కొందరు.. రేంజ్‌ పరిధి, సిటీ సీనియారిటీలను సరిచేయలేదంటూ మరికొందరు అధికారులు జగడాలకు దిగారు.  కొందరు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదులు చేసేవరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పదోన్నతుల వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. 
 
సుప్రీంకోర్టు హెచ్చరించినా..
ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన డీజీపీలు చేసిన పొరపాట్లు ఇప్పుడు పోలీసుశాఖకు పీకల్లోతు కష్టాలు తెచ్చిపెట్టాయి. హైదరాబాద్‌ సిటీ, రేంజ్‌ మధ్య నడుస్తున్న సీనియారిటీ వివాదం, పోస్టుల పంచాయితీలు ఇప్పుడు పదోన్నతుల వ్యవహారంతో మళ్లీ తెరమీదకు వచ్చాయి.  ఈ అంశాలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ఆవిర్భావ సమయంలోనే అప్పటి డీజీపీకి మొట్టికాయలు వేసింది. సీనియారిటీ పాటించకుండా పదోన్నతులు కల్పించడంపై అధికారులను జైలుకు పంపిస్తామనీ హెచ్చరించింది. అయినా సాదాసీదాగా రూపొందించిన సీనియారిటీ జాబితాను కోర్టుకు సమర్పించి అప్పటి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌ సిటీ, రేంజ్‌ పంచాయితీ తీవ్రరూపం దాల్చింది. తప్పులతడకగా ఉన్న ఇన్‌స్పెక్టర్ల సీనియారిటీ జాబితాను సరిచేయకుండానే పదోన్నతులు కల్పిస్తున్నారంటూ 1995, 96 బ్యాచ్‌లకు చెందిన అధికారులు ముఖ్యమంత్రికి, హోంమంత్రికి ఫిర్యాదులు చేశారు. రేంజ్‌ పోస్టుల సీనియారిటీని సరిచేస్తే తాము పదోన్నతులకు అర్హులమవుతామని వివరించారు. 
 
రోజుకో జాబితా తయారీ!
పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో రోజుకో జాబితా తయారవుతోంది. వాస్తవానికి ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ పదోన్నతులు పొందే 121 మంది అధికారుల జాబితాను గత నెల 18నే సిద్ధం చేసి, పలు యూనిట్లకు పరిశీలన నిమిత్తం పంపించారు. అయితే ఆ జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు అధికారులు సీఎం కార్యాలయానికి, హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో మళ్లీ ఈ నెల 20న 19 పేర్లు అదనంగా జతచేసి మరో జాబితా సిద్ధం చేశారు. మరోవైపు డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతులు పొందే 82 మంది అధికారుల జాబితాను ఈ నెల 12న రూపొందించి యూనిట్లకు పంపగా.. తమ పేర్లు లేవంటూ కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో 20వ తేదీన మరో 11 మంది పేర్లు కలిపి కొత్త జాబితా రూపొందించారు. అటు అదనపు ఎస్పీ నుంచి నాన్‌కేడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందే 29 మంది పేర్లతో తొలుత జాబితాను రూపొందించగా.. తమ పేర్లు లేవంటూ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ జాబితానూ మార్చేయత్నం చేస్తున్నారు. ఇలా రోజుకో జాబితాతో గందరగోళం సృష్టించారు.
 
సెక్షన్‌ అధికారులు చెప్పిందే ఫైనల్‌!
సెక్షన్‌ అధికారులు చెప్పినట్లుగా రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో పదోన్నతుల ప్రక్రియ జరుగుతోందనే అభిప్రాయాలు వస్తున్నాయి. సీనియారిటీ, రేంజ్‌ పోస్టుల నిబంధనలు, సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారని 1989, 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. 
 
జాబితాల్లో మృతిచెందిన వారి పేర్లు
ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీగా పదోన్నతి కల్పించేందుకు సిద్ధం చేసిన జాబితాలో పలువురు మరణించిన అధికారుల పేర్లు ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ సిటీకి చెందిన ఇన్‌స్పెక్టర్‌ పి.కృష్ణయ్య, వరంగల్‌ రేంజ్‌కు చెందిన టి.తిరుపతిరావు కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఈ విషయం సైతం తెలుసుకోకుండా పదోన్నతుల జాబితాలో చేర్చేశారు. అదే విధంగా ఇప్పటికే డీఎస్పీగా పదోన్నతి పొందిన అధికారి బాలస్వామి పేరును డీఎస్పీ పదోన్నతుల జాబితాలో పెట్టారు. సెక్షన్‌ అధికారుల పనితీరుకు ఈ మూడు ఉదాహరణలు నిదర్శనమంటూ 1995, 96 బ్యాచ్‌ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
సరైన ప్రణాళిక లేకుండానే..: భారీగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు దానికి తగ్గట్టు ప్రణాళికను సిద్ధం చేసుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement