పక్కా ప్లాన్? | police reveal abhay kidnaping and murdur mystery | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్?

Published Fri, Mar 18 2016 2:44 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM

పక్కా ప్లాన్? - Sakshi

పక్కా ప్లాన్?

తండ్రి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు తెలిసిన దుండగులు
స్కూల్ దగ్గర కలుస్తూ బాలుడితో పరిచయం
పక్కా రెక్కీ తర్వాతే ‘నమ్మక ద్రోహం’
డబ్బు కోసమే కిడ్నాప్ అనుకోని పరిస్థితుల్లో హత్య?


సాక్షి, సిటీబ్యూరో: షాహినాయత్‌గంజ్‌లోని జ్ఞాన్‌బాగ్ కాలనీ సీతారాంపేట్‌లో అదృశ్యమై... సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ వద్ద శవమై కనిపించిన టెన్త్ క్లాస్ బాలుడు అభయ్ కిడ్నాప్.. మర్డర్ మిస్టరీలో ఆసక్తికర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడి తండ్రి రాజ్‌కుమార్ వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు దుండగుల కోసం వేట ముమ్మరం చేశారు.

 అభయ్‌తో పరిచయం పెంచుకుని...
సీతారాంపేటలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ సమీపం నుంచి అభయ్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకు వెళ్లిన దుండగుడు కొంతకాలం ముందు నుంచే బాలుడితో పరిచయం పెంచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడు ఎలాంటి పెనుగులాట లేకుండా ద్విచక్ర వాహనం ఎక్కడం... కొద్దిదూరం అతడే వాహనాన్ని డ్రైవ్ చేసినట్లు తెలియడంతో ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభయ్‌తో ఇంటి వద్ద కొత్త వ్యక్తులు పరిచయం పెంచుకోవడం సాధ్యం కాదు. అది జరిగితే కిడ్నాప్ తర్వాత వారి పైనే అనుమానాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు అబిడ్స్‌లోని స్లేట్ ద స్కూల్ వద్ద బాలుడితో పరిచయం పెంచుకుని కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి.

 నమ్మకంగా పిలిచి అపహరణ
కిడ్నాపర్లు కొద్ది రోజులుగా సాయంత్ర వేళ అభయ్ కదలికలను గమనించడంతో పాటు అతడితో కలిసి సరదాగా షికార్లు చేసినట్లు తెలుస్తోంది. అలా పెంచుకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు కిడ్నాప్‌కు పథక రచన చేశారు. రోజూలాగానే అభయ్ బుధవారం సైతం సీతారాంపేటలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వస్తాడని తెలుసుకున్న కిడ్నాపర్ అక్కడే కాపు కాయడమో... ఫోన్ చేసి బాలుడిని అక్కడికి రప్పించడమో చేశాడనుకుంటున్నారు. ముందే ఏర్పడిన పరిచయంతో కిడ్నాపర్ ద్విచక్ర వాహనం ఎక్కడానికి అభయ్ సంశయించ లేదు. అలా నమ్మకంగా తన వాహనం ఎక్కించుకున్న దుండగుడు అభయ్‌తో కలిసి కొంత దూరం వరకు ద్విచక్ర వాహనం పైనే ప్రయాణించాడు. ఆపై అసలు ‘కథ’ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 వాహనంతో పాటే మారిన సీన్...
టిఫిన్ సెంటర్ నుంచి కొంత దూరం వరకు అభయ్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లిన దుండగుడు ఆపై అసలు వ్యవహారం ప్రారంభించాడు. ముందే నిర్ణయించుకున్న ప్రాం తంలో కారు లేదా తేలికపాటి వాహనంలో వేచి ఉన్న అనుచరులను కలిశాడు. అది కచ్చితంగా నిర్మానుష్య ప్రాంతై మె ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. తనను కూడా ఆ వాహనంలో ఎక్కించుకోవడం... ఎక్కడికో చెప్పకుండా తీసుకు వెళ్లడానికి ఉపక్రమించిన తర్వాతే అభయ్‌కు తొలిసారిగా అనుమానం వచ్చి ఉంటుందనే  భావన ఉంది. దీంతో సీన్ మారినట్లు గుర్తించిన బాలుడు తప్పించుకునే ప్రయత్నాలు చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 అనుకోకుండా హత్య?
అభయ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ముందే నిర్ణయించుకున్న ప్రాంతానికి తీసుకువెళ్లి బంధించాలని భావించారని తెలుస్తోంది. అది సాయంత్రం కావడం... నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు... తనిఖీలు వీరికి ప్రతికూలంగా మారాయి. తమ వాహనంలో ఉన్న అభయ్ మార్గమధ్యలో ఏమాత్రం గలాభా చేసినా... చుట్టు పక్కల వారితో పాటు ఇతర వాహన చోదకులు, జంక్షన్ల వద్ద ఉండే పోలీసుల దృష్టిలో పడతామని దుండగులు భావించారని తెలుస్తోంది. అలా జరగకుండా ఉండటానికే బాలుడిని వాహనం సీట్ల మధ్యలోనో మరో ప్రాంతంలోనో అదిమిపట్టి ఉంటారని, అతడు అరవకుండా ఉండేందుకు పేపర్‌తో నోరు మూసే ప్రయత్నంలో ముక్కు కూడా మూసేయడంతో బాలుడి ప్రాణం పోయి ఉంటుంద ని భావిస్తున్నారు. ఇలా కాకుండా కిడ్నాప్ నేపథ్యంలో గలా భా చేస్తున్నాడనే ఉద్దేశంతో హత్య చేసి ఉంటారనే వాదనా ఉంది.

 కార్టన్ బాక్స్ కొని...
అభయ్ మృతదేహానికి నోరుతో పాటు చేతులు వెనక్కు విరిచిన స్థితిలో మణికట్ల వద్ద ప్లాస్టర్ వేసి ఉంది. దాన్ని పరిశీలించిన పోలీసులు వైద్యులు వినియోగించే సర్జికల్ ప్లాస్టర్‌గా గుర్తించారు. అభయ్ చనిపోయాడని గుర్తించిన దుండగులు... సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఏదైనా మెడికల్ షాపులో ప్లాస్టర్‌తో పాటు అక్కడే కార్టన్ బాక్స్, సన్నటి ప్లాస్టిక్ తాడు తీసుకుని ఉంటారని తెలుస్తోంది. మృతదేహంతో నగరం దాటడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే వీటి సాయంతో వాహనంలోనే నిర్జన ప్రదేశంలో అభయ్ మృతదేహాన్ని పార్శిల్ చేశారనే అనుమానాలున్నాయి. ఆ పెట్టెను వాహనంలో పెట్టుకుని వెళ్తూ... ఆల్ఫా హోటల్ వద్ద వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. మొత్తం ఐదుగురిగా భావిస్తున్న దుండగుల్లో ఇద్దరు ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లో ఆగిపోగా... మిగిలిన ముగ్గురూ సికింద్రాబాద్ నుంచే రైలులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం. 

ఎవరీ వీరేష్ అలియాస్ ఇమ్రాన్?
అభయ్ కుటుంబీకులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి కిడ్నాపర్లు ‘78422 76480’ నెంబర్ వాడారు. సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకోమో రికార్డుల ప్రకారం ఈ ఫోన్ ‘బి.వీరేష్, హరి నగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్‌నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టరై ఉంది. మొబైల్ యాప్ ‘ట్రూ కాలర్’లో నమోదైన వివరాల ప్రకారం ఈ నెంబర్ తల్వార్ వర్క్‌షాప్‌నకు చెందిన ఇమ్రాన్ వినియోగిస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే వీరేష్ పేరుతో తీసుకున్న నెంబర్‌ను ఇమ్రాన్ వినియోగిస్తున్నాడా? ఈ నేరంతో వీరేష్, ఇమ్రాన్‌లకు సంబంధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి నగర పోలీసులు గురువారం రాత్రి ఇద్దరిని పట్టుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురు నిందితులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుని గాలిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement