సాక్షి, హైదరాబాద్: పోలీస్ రోబో.. రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇదీ. అయితే ఈ పోలీస్ రోబో కాస్తా ఇప్పుడు మెమరీలాస్‌తో సతమతమవుతోంది. మనుషులను గుర్తించడం.. ఇతరత్రా సాంకేతిక విషయాల్లో తడబడుతోంది. నగరంలోని హెచ్‌బోట్స్ రోబోటిక్స్ సంస్థ రూ.7 లక్షల వ్యయంతో ‘స్మార్ట్ పోలీసింగ్ రోబో బెటా వెర్షన్’ను రూపొందించింది. వాస్తవానికి డిసెంబర్ 31నే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఈ రోబోను బహిరంగంగా పరీక్షించాలని భావించినా సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేశారు. అయితే ఇప్పటికే ఫోరంమాల్‌తోపాటు జేఎన్‌టీయూ చౌరస్తాలో ఈ రోబోను ఒక గంట పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించినట్టు హెచ్‌బోట్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
రోబోలోని కెమెరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని.. అయితే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ.. వారి ఫిర్యాదులకు ప్రతిస్పందించే తీరులో స్పష్టత లేకపోవడంతో ఈ రోబోపై మరిన్ని పరీక్షలు చేసి ఆధునికరిస్తామన్నారు. కాగా, త్వరలో నాగ్‌పూర్‌లోనూ ఈ రోబో కృత్రిమ మేధస్సుకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల అనంతరం మార్చిలో ఈ రోబోను బహిరంగ ప్రదేశాల్లో మరోసారి పరీక్షిస్తామని.. జూలై నుంచి సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దుతామని నిర్వాహకులు ‘సాక్షి’కి తెలిపారు. పోలీసు విధుల్లో పాలుపంచుకునేందుకు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను రోబోలో మిళితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆరు నెలలుగా నలుగురు ఫౌండర్లు, మరో 16 మంది సభ్యులు ఈ రోబో తయారీకి అహర్నిశలు శ్రమించారని హెచ్‌బోట్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు కిషన్ పీఎస్‌వీ తెలిపారు.
బాసూ.. మెమరీలాసు..!
Published Wed, Jan 31 2018 2:43 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment